- రెండు చెరువులకే పరిమితమైన డీజీపీఎస్ సర్వే
- రికార్డుల ఆధారంగా విస్తీర్ణం నిర్ధారణ
- సర్వే, హద్దులు లేక ఆగని కబ్జాలు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలోని చారిత్రక గొలుసుకట్టు చెరువుల రక్షణ కోసం ప్రతిష్ఠాత్మకంగాచేపట్టిన డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) సర్వే అర్ధాంతరంగా ఆగిపోయింది. రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో అప్పటి కలెక్టర్ ఈ సర్వేను సంయుక్తంగా చేపట్టారు. కానీ ఈ సర్వేను కేవలం రెండు చెరువులకు మాత్రమే పరిమితమై అటకెక్కించారు.
మిగతా 10 చెరువుల సర్వే చేపట్టలేదు. ఇది కబ్జాదారులకు వరంగా మారింది. సాంకేతికంగా చెరువు భూముల హద్దులను గుర్తించకపోవడంతో ఇష్టారాజ్యంగా శిఖం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ భూముల ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. కబ్జాల కారణంగా గొలుసుకట్టు చెరువుల ఉనికి ప్రమాదంలో పడింది.
హద్దులు, వివాదాల పరిష్కారానికి..
జిల్లా కేంద్రంలోని చెరువులను పరిరక్షించేందుకు, వాటి సరిహద్దులను తెలుసుకునేందుకు డీజీపీఎస్ సర్వేను కొద్దిరోజుల క్రితం అధికారులు తెరపైకి తెచ్చారు. ఈ డీజీపీఎస్పరికరం శాటిలైట్‌తో అనుసంధానమై భూముల హద్దులను పక్కాగా నిర్ణయిస్తుందని, ఈ సర్వే ఆధారంగా చెరువులకు సంబంధించిన శిఖం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ భూములకు రక్షణ ఏర్పడుతుందని అధికారులు అప్పట్లో వెల్లడించారు. ఈ సర్వేతో భూమి హద్దులపై నెలకొన్న సందేహాలు తొలగిపోతాయని, వివాదాలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.
అందుకు అనుగుణంగానే కంచరోని చెరువు, కుర్రన్న పేట చెరువు విస్తీర్ణాన్ని సర్వే చేసి హద్దులను నిర్ధారించారు. ఆక్రమణకు గురైన భూములను సైతం గుర్తించి ఈ హద్దుల ఆధారంగా ట్రెంచ్‌లు ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో మిగతా చెరువుల విస్తీర్ణాలను కూడా సర్వే చేసి హద్దులను నిర్ధారిస్తామని, కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. అయితే ఈ సర్వేను కేవలం రెండు చెరువులకు మాత్రమే పరిమితం చేశారు. మిగతా పది చెరువుల సర్వే చేపట్టకుండా వదిలేశారు. రాజకీయ నేతలు, ఆక్రమణదారుల ఒత్తిడి పెరగడంతో సర్వేను పూర్తిచేయలేదని తెలుస్తోంది. సాంకేతికంగా చెరువు భూముల హద్దులను గుర్తించకపోవడంతో ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి.
రెవెన్యూ రికార్డుల ప్రకారం లెక్కలు ఇలా...
ఇప్పటికే వందలాది ఎకరాల చెరువు భూమలు కబ్జాకు గురయ్యాయని, ఇప్పటికైనా డీజీపీఎస్ సర్వే చేసి హద్దులు వేసి కబ్జా కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. బంగల్ పేట చెరువు 210.32 ఎకరాలు, మోతి తలాబ్ చెరువు 132.06, ఖజానా చెరువు 98.22, కొత్త చెరువు 33.11, కంచరోని చెరువు 74.19, చిన్న చెరువు మంజులాపూర్ 81.34, జాపూర్ కూరన్నపేట చెరువు 76.18, ధర్మసాగర్ చెరువు 65.10, ఇబ్రహీం చెరువు 76.18, రామ్ సాగర్ చెరువు 37.23, సీతాసాగర్ గొల్లపేట చెరువు 48.11 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు అధికారుల వద్ద ఉన్న రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
అయితే భారీ స్థాయిలో ఆక్రమణలు జరిగాయని, చెరువు విస్తీ ర్ణం 70 శాతానికి పైగా తగ్గిపోయిందని స్థానికులు పేర్కొంటున్నారు. మొత్తం చెరువు భూముల విస్తీర్ణం వివరాలు, ఆక్రమణల లెక్కలు తేలేందుకు డీజీపీఎస్ సర్వే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.