LSG vs PBKS: పంజాబ్ బ్యాటర్‌పై దురుసు ప్రవర్తన.. లక్నో బౌలర్‌పై కొరడా ఝుళిపించిన బీసీసీఐ!

LSG vs PBKS: పంజాబ్ బ్యాటర్‌పై దురుసు ప్రవర్తన.. లక్నో బౌలర్‌పై కొరడా ఝుళిపించిన బీసీసీఐ!

మంగళవారం (ఏప్రిల్ 1) పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్‌ హద్దు మీరు ప్రవర్తించాడు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్యను ఔట్ చేసిన తర్వాత అతని సెలెబ్రేషన్స్ అతిగా అనిపించింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో దిగ్వేష్ వేసిన బంతిని భారీ షాట్ ఆడే క్రమంలో ప్రియాంష్ ఆర్యకు సరిగా టైమింగ్ కుదరలేదు. బంతి అక్కడే గాల్లోకి లేచింది. శార్దూల్ ఠాకూర్ క్యాచ్ అందుకోవడంతో ఈ పంజాబ్ ఓపెనర్ కేవలం 8 పరుగులకే పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. 

ఔటై గ్రౌండ్ వదిలి వెళ్తున్న సమయంలో దిగ్వేష్..ప్రియాంష్  దగ్గరకు వచ్చి 'నోట్‌బుక్ సెలెబ్రేషన్స్' చేస్తూ చేసుకున్నాడు. పెవిలియన్ కు వెళ్లాలని సైగ చేస్తూవు అతిగా ప్రవర్తించాడు. అయితే ప్రియాంష్  మాత్రం అతడిని ఏమీ అనకుండా సైలెంట్ గా తలదించుకుని వెళ్ళాడు. మ్యాచ్ తర్వాత దిగ్వేష్ సింగ్‌కు బీసీసీఐ భారీ జరిమానా విధించింది. అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది.

"మంగళవారం లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేష్ సింగ్‌కు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించబడింది. ఒక డీమెరిట్ పాయింట్ కూడా వచ్చింది" అని ఐపీఎల్ విడుదల చేసిన ప్రకటనలో బీసీసీఐ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరూ ఢిల్లీ ఆటగాళ్లే కావడం విశేషం. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఇద్దరూ ఒకే జట్టు తరపున ఆడడం విశేషం. 

Also Read:-అలా అనకుండా ఉండాల్సింది: పంత్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్స్

ఈ మ్యాచ్ లో మిగిలిన బౌలర్లందరూ విఫలమైనా.. దిగ్వేష్ ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌‌‌‌‌‌‌‌ జెయింట్స్‌‌‌‌‌‌‌‌పై ఘన విజయం సాధించింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన లక్నో 20 ఓవర్లలో 171/7 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలో 177 పరుగులు చేసి గెలిచింది.