ఖైదీల్లో మార్పు తేవాలి ..మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన

  • జైల్‌‌‌‌ వార్డర్స్ దీక్షాంత్ పరేడ్​కు హాజరు

హైదరాబాద్, వెలుగు: ఖైదీల్లో మంచి పరివర్తన తీసుకురావడమే జైల్‌‌‌‌ వార్డర్స్ కర్తవ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. జైలు అంటే ఖైదీలకు శిక్ష వేయడం కాదని.. వారిలో పరివర్తన తీసుకొస్తూ నైపుణ్యాలు మెరుగుపర్చేలా రాష్ట్ర జైళ్ల శాఖ పని చేస్తున్నదని అన్నారు. సత్‌‌‌‌ప్రవర్తన కలిగిన 249 మంది ఖైదీలను తమ ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తుచేశారు. జైళ్ల శాఖలో వార్డర్‌‌‌‌‌‌‌‌గా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న  92 మంది గురువారం పాసింగ్ అవుట్‌‌‌‌ పరేడ్ నిర్వహించారు.

చంచల్‌‌‌‌గూడ్‌‌‌‌లోని జైల్స్ హెడ్‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, హోంశాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్త, జైల్స్ డీజీ సౌమ్యమిశ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. ప్రొఫెషనల్ ఖైదీల పట్ల కఠినంగా వ్యవహరిస్తూనే వారిలో మార్పు తేవాలని సూచించారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో 29 పెట్రోల్ బంకులు నిర్వహించడం అభినందనీయమన్నారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జైల్ వార్డర్స్‌‌‌‌కి మెడల్స్ ప్రధానం చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

ముషీరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు. గురువారం సెక్రెటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. బీఆర్ఎస్​పాలనలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కార్మికుల సమస్యలను మంత్రికి వివరించారు.

అనంతరం విద్యానగర్ లోని యూనియన్​ఆఫీసులో హనుమంత్ ముదిరాజ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్మిక సంఘాలను పునరుద్ధరించాలని, కార్మికుల్లోని అసంతృప్తిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సంస్థను గాడిలో పెట్టి అభివృద్ధికి కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.