ఎఫ్‌‌డీసీ ఛైర్మన్‌‌గా దిల్‌‌ రాజు

ఎఫ్‌‌డీసీ ఛైర్మన్‌‌గా దిల్‌‌ రాజు

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌‌‌‌ దిల్‌‌ రాజును రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవిలో నియమించింది.  తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌‌డీసీ) చైర్మన్‎గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌ రెడ్డిని దిల్‌‌ రాజు, ఆయన తమ్ముడు శిరీష్‌‌ మర్యాద పూర్వకంగా కలిశారు. రెండేళ్ల పాటు దిల్ రాజు ఈ పదవిలో కొనసాగుతారు.  

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆయన అసలు పేరు వెంకటరమణారెడ్డి. ‘పెళ్లి పందిరి’ (1990) చిత్రంతో డిస్ట్రిబ్యూటర్‌‌‌‌గా సినిమా ఇండస్ట్రీకి వచ్చారు.  2003లో ఆయన నిర్మించిన తొలిచిత్రం ‘దిల్’ విజయంతో అదే ఆయన ఇంటి  పేరుగా మారింది. అది మొదలు తమ్ముడు శిరీష్‌‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించి అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం రామ్ చరణ్‌‌తో నిర్మిస్తున్న ‘గేమ్‌‌ ఛేంజర్‌‌‌‌’ చిత్రం నిర్మాతగా ఆయనకు 50వ సినిమా.  ఈ సినిమాతో పాటు వెంకటేష్‌‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’, వేణు శ్రీరామ్ డైరెక్షన్‌‌లో ‘తమ్ముడు’ చిత్రాలను ఆయన నిర్మిస్తున్నారు.