ఐటీ విచారణకు దిల్ రాజు.. సంక్రాంతి సినిమాల ఎఫెక్టేనా..?

ఐటీ విచారణకు దిల్ రాజు.. సంక్రాంతి సినిమాల ఎఫెక్టేనా..?

హైదరాబాద్: తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఐటీ అధికారుల విచారణకు హాజరయ్యారు. గత వారం నిర్మాత దిల్ రాజు నివాసంతో పాటు పలువులు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇండ్లలో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. దిల్ రాజు నివాసంలో నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. దిల్ రాజు నివాసంతో పాటు ఆయన కూతురు, సోదరుడి ఇళ్లలోనూ అధికారులు జల్లెడ పట్టారు.

దిల్ రాజు ఆర్థిక లావాదేవీల వివరాలు, బ్యాంక్ లాకర్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. అలాగే.. ఈ సంక్రాంతి పండక్కి దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సినిమాల బడ్జెట్ వివరాలను ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ సోదాలు చేశారు. సినిమాలకు పెట్టిన ఖర్చు ఎంత..? వచ్చిన రాబడి ఎంత..? అని ఆరా తీశారు. అలాగే.. దిల్ రాజు ఐటీ రిటర్న్స్, బ్యాలెన్స్ షీట్లను పరిశీలించారు. సోదాల ముగిసిన అనంతరం దిల్ రాజుకు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 

Also Read :- భగ్గుమంటున్న బంగారం.. తులం ధర ఎంతైందంటే

వ్యాపారాలకు సంబంధించిన వివరాలు, సినిమాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ లాభాలకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకుని 2025, ఫిబ్రవరి 4న విచారణకు రావాలని ఆదేశించారు. ఐటీ అధికారుల నోటీసుల మేరకు.. మంగళవారం (ఫిబ్రవరి 4) దిల్ రాజు హైదరాబాద్ లోని ఐటీ కార్యాలయానికి వెళ్లారు. సినిమాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ లాభాల వ్యవహారంపై ఐటీ అధికారులు దిల్ రాజును ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు విచారణ నేపథ్యంలో ఐటీ తర్వాత స్టెప్ ఏంటనే దానిపై ఉత్కంఠ నెలకొంది.