ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సినీ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీ పెద్దలు సీఎం రేవంత్ తో భేటీ అవ్వడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. ఇదిలా ఉండగా.. ఈ భేటీపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న క్రమంలో నిర్మాత, టీఎఫ్డీసీ చైర్మెన్ దిల్ రాజు స్పందించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని అన్నారు. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెల్సిందేనని.. అనవసర వివాదాల్లోకి సినీ ఇండస్ట్రీని లాగొద్దని అన్నారు దిల్ రాజు.
తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి.. రాష్ట్రాభివృద్ధికి, సామజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం కాంక్షించారని అన్నారు దిల్ రాజు. హైదరాబాదును గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చదిద్దాలన్నదే సీఎం రేవంత్ సంకల్పమని.. సీఎం బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా తామంతా స్వాగతించామని స్పష్టం చేశారు.
— Chairman - Film Development Corp (@TGFDC_Chairman) December 31, 2024
అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మనవి చేస్తున్నానని అన్నారు. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరిని కోరుతున్నామని అన్నారు.లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నామని అన్నారు దిల్ రాజు.