
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. వాటిలో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ‘కింగ్‌డమ్’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మే 30న రిలీజ్ కానుంది. అలాగే ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ మినహా ఇప్పటివరకూ ఈ చిత్రం గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు.
అయితే బుధవారం జరిగిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో అనుకోకుండా ఈ చిత్రం టైటిల్‌ను దిల్ రాజు రివీల్ చేశారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘రౌడీ జనార్దన్’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని ఏప్రిల్ లేదా మే నెల నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్టు దిల్ రాజు వెల్లడించారు. ఈ చిత్రంతో పాటు రాహుల్ సాంకృత్యాయన్ తెరకెక్కించనున్న హిస్టారికల్ పీరియాడిక్ డ్రామాలోనూ విజయ్ దేవరకొండ నటించనున్నాడు.