హైదరాబాద్, వెలుగు: అనుమతి లేకుండా కొత్త సినిమాలను ప్రైవేటు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, లోకల్ కేబుల్ చానల్స్ లో ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఒక ప్రకటనలో హెచ్చరించారు. అనుమతి లేకుండా కొత్త సినిమాలు ప్రదర్శిస్తున్నారని తెలుగు ఫిలిం చాంబర్ (ఎఫ్డీసీ) తమ దృష్టికి తీసుకొచ్చిందని, ఇది పైరసీ కాపీరైట్ కింద నేరమని పేర్కొన్నారు. ‘‘ఆర్థికంగా సినీ పరిశ్రమ నష్టపోయే ప్రమాదం ఉన్నది.
ప్రభుత్వ ఖజానాతో పాటు నిర్మాతలకు లాస్ వస్తది. ప్రజలకు వినోదం పంచేందుకు నిర్మాతలు, డైరెక్టర్లు కోట్ల రూపాయలు ఖర్చుపెడ్తరు. పైరసీ కారణంగా భారీగా నష్టపోతరు. వేలాది మంది కార్మికులు, ఆర్టిస్టులపై ప్రభావం పడ్తది. వాళ్లంతా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంటది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సమగ్రతను కాపాడాలి’’అని దిల్ రాజు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్నదని తెలిపారు.