పెద్దారెడ్డి టైపోడు : అంబానీ పీఏ అంట.. దిల్ రాజు అల్లుడి కారు కొట్టేశాడు.. పోలీసులతోనే ఓవరాక్షన్

సినీ నిర్మాత దిల్ రాజ్ అల్లుడి కారును ఎత్తుకెళ్లారు దొంగలు. దిల్ రాజ్ అల్లుడు అర్చిత్ రెడ్డి అక్టోబర్ 14న  తన పోర్షే కారులో హైదరాబాద్ లోని దస్ పల్లా హోటల్ కు వెళ్లారు.  బయట పార్కింగ్ ప్లేసులో పార్కింగ్ చేసి హోటల్ కు వెళ్లారు. అరగంట తర్వాత తిరిగి వచ్చే సరికి కారు లేదు. ఆందోళనకు గురైన  అర్షిత్ రెడ్డి  హోటల్ సీసీ కెమెరాలను పరిశీలించగా.. స్కూటీపై వచ్చిన ఓ యువ కుడు కారును చోరీ చేసి పారిపోతున్నట్లు కనిపించింది. వెంటనే డయల్ 100 ద్వారా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  రూ.1.20 కోట్ల  విలువ చేసే స్పోర్ట్స్ కారుగా గుర్తించారు. 

వెంటనే  జూబ్లీహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వీరశేఖర్, డీఎస్ఐ రాజశే ఖర్తో పాటు క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. నీరూస్ చౌరస్తా మీదుగా చెక్ పోస్టు వైపు కారు వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే జూబ్లీహిల్స్ చెకో పోస్ట్ వద్ద, కేబీఆర్ వద్ద డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేయగా... చెకోపోస్ట్ నుంచి కేబీఆర్ పార్కు వైపు వెళ్తున్న కారును అడ్డగించారు. కారులోని యువకుడిని ప్రశ్నించగా  సరైన పత్రాలు చూపించలేదు. దీంతో అతడిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.

Also Read :-అది నా బ్లడ్ లోనే ఉంది

కారు ఎత్తుకెళ్లిన వ్యక్తిని మన్సూరాబాద్ కు చెందిన మల్లెల సాయికిరణ్(30)గా పోలీసులు గుర్తించారు.  అయితే పోలీసుల విచారణలో సాయి కిరణ్ చెప్పిన మాటలు వింటే  జేడీ చక్ర వర్తి నటించిన  అనగనగా ఒకరోజు  సినిమాలో బ్రహ్మానందం చెప్పిన  నెల్లూరి పెద్దారెడ్డి తెలుసా? ఈ డైలాగ్ గుర్తొస్తుంది. 

తాను ముఖేశ్ అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీకి మేనేజర్ గా పనిచేస్తున్నానని.. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తనకు మేనేజర్ అంటూ  పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసుల మైండ్ బ్లాంక్ అయిపోయింది. అయితే నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు. సాయి కిరణ్ పై వనస్థలిపురంలో కూడా కేసు నమోదయినట్లు గుర్తించారు. అయితే అర్షిత్ రెడ్డి కారుకు లాక్ వేయకపోవడం వల్లే చోరీ అయినట్లు పోలీసులు చెప్పారు.