శిథిలావస్థకు చేరిన కాలేజీ, హాస్టల్ బిల్డింగ్స్‌‌

శిథిలావస్థకు చేరిన కాలేజీ, హాస్టల్ బిల్డింగ్స్‌‌
  • రిపేర్లకు పైసా ఇవ్వని సర్కారు 
  • ఇప్పటికే హాస్టల్ బిల్డింగ్‌‌కు తాళం
  • ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్లు
  • ప్రత్యామ్నాయం చూపాలని రాస్తారోకో

వనపర్తి, వెలుగు: భారత తొలి ప్రధాని పండిట్ జవహార్ లాల్ నెహ్రూ ప్రారంభించిన వనపర్తి కేడీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీని సర్కారు పట్టించుకోవడం లేదు. ప్రపోజల్స్‌‌ పంపినా రిపేర్లకు పైసా ఇవ్వకపోవడంతో శిథిలావస్థకు చేరింది.  కాలేజీ హాస్టల్ భవనం పైకప్పు పెచ్చులూడుతుండడంతో అకడమిక్ ఇయర్‌‌‌‌ ప్రారంభం నుంచే తాళం వేసి ఉంచారు.  ఎన్నిసార్లు అడిగినా ప్రత్యామ్నాయం చూపకపోవడంతో స్టూడెంట్లు శుక్రవారం ఏబీవీపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో  కాలేజీ ఎదుట రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలేజీ తెరిచి  మూడు నెలలు అవుతున్నా హాస్టల్‌‌ సౌకర్యం కల్పించడం లేదని మండిపడ్డారు. బయట రూములు అద్దెకు తీసుకొని వంట వండుకొని కాలేజీకి రావడం కష్టంగా ఉందని వాపోయారు. వెంటనే హాస్టల్ తెరవాలని, లేదంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లైనా చేయాలని  డిమాండ్ చేశారు.  ట్రాఫిక్ జామ్‌‌ కావడంతో టౌన్ పోలీసులు స్టూడెంట్లను అక్కడి నుంచి పంపించారు. 

సంస్థానాధీశుల రాజభవనం

వనపర్తి సంస్థానాధీశుల రాజభవనాన్ని 1956లో పాలిటెక్నిక్ కాలేజీ కోసం ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. హాస్టల్ ,  కొన్ని తరగతి గదులను తర్వాత నిర్మించినా అవి శిథిలావస్థకు చేరాయి. ప్రస్తుతం సివిల్, ఎలక్ర్టికల్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్‌‌స్ట్రుమెంట్, ఫార్మసీ కోర్సుల్లో మొత్తం 1020 మంది స్టూడెంట్లు ఉన్నారు. భవనం తరచూ పెచ్చులూడి పడుతుండడంతో వీరు భయంభయంగానే క్లాసులకు వెళ్తున్నారు. పలుచోట్ల ‘ఈ భవనం బలహీనంగా ఉంది, జాగ్రత్తగా చూసి నడవండి’ అని బోర్డులు పెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రతిపాదనలు పంపినా.. 

పాత భవనం స్థానంలో కొత్తది నిర్మించడంతో పాటు ప్రత్యేకంగా హాస్టల్‌‌ను ఏర్పాటు చేసేందుకు ప్రిన్సిపాల్ నిరుడు రూ.21 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటి వరకు సర్కారు నుంచి స్పందన రాలేదు.  గతంలోనూ చాలాచార్లు ప్రపోజల్స్‌‌ పంపినా ఫండ్స్‌‌ రిలీజ్‌‌ చేయలేదు. 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏవి? 

ప్రస్తుతం ఉన్న హాస్టల్‌‌ భవనం ఏ క్షణమైనా కూలొచ్చని, వెంటనే మూసివేయాలని ఆర్‌‌‌‌అండ్‌‌బీ శాఖ ప్రస్తుతం ప్రిన్సిపాల్‌‌కు నోటీసులు ఇవ్వడంతో తాళం వేయించారు. కానీ,  స్టూడెంట్లకు ప్రత్యామ్నాయం చూపలేదు.  హాస్టల్ వసతి ఉంటుందనే కాలేజీలో చేరామని, బయట రూముల్లో, ప్రైవేట్‌‌ హాస్టళ్లలో ఉండలేకపోతున్నాని స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  బీసీ వెల్పేర్, ఎస్సీ వెల్ఫేర్‌‌‌‌ శాఖల పరిధిలో ఉన్న భవనాల్లో  తాత్కాలికంగా అయినా హాస్టల్‌‌ ఏర్పాటు చేయాలని  కోరుతున్నారు. 

మంత్రి, కలెక్టర్‌‌‌‌కు రిక్వెస్ట్ పెట్టినం

వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీ పాత భవనం మూసివేయాలని ఆర్అండ్ బీ శాఖ నివేదిక పంపించింది. ఇందులో భాగంగా హాస్టల్‌‌కు తాళం వేయడంతో పాటు  ప్రమాదకరంగా ఉన్న భవనాల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టినం. కొత్త భవనాల కోసం రూ.21 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినం.   స్టూడెంట్లకు మరోచోట హాస్టల్ ను ఏర్పాటు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్‌‌ బాషాను కోరినం. 

–చంద్రశేఖర్, ప్రిన్సిపాల్,  

కేడీఆర్ పాలిటెక్నిక్ కాలేజీ, వనపర్తి