కొత్త సంకల్పం కొమ్మ తొడగాలె

ఇప్పుడు దేశమంతా డెబ్బై అయిదేళ్ల స్వాతంత్ర్య అమృతోత్సవాలు ఆర్భాటంగా జరుగుతున్నాయి. మువ్వన్నెల జెండాలు చిద్విలాసంగా ఎగురుతున్నాయి. దేశ భక్తినీ, స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని వ్యాపింపజేసే కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇలా వారమో, పదిరోజులో అయితే ఈ వేడుకలు ముగిసి, జనజీవితం మళ్లీ మూమూలవుతుంది. అప్పుడేంటి? ఇదంతా ఒఠ్టిపోవాల్సిందేనా? ఎంతో డబ్బు–దస్కం వెచ్చించి, కార్యక్రమాలు అల్లి, కోట్ల మందిని కదిలించి, స్ఫూర్తి నింపి, పులకింప జేసిన వేడుక ఏదీమిగల్చకుండానే వెళిపోతే ఎట్లా?  అలా కాదు, ఏదో నికర లాభం ఉండాలి! 200  ఏండ్ల పరాయి పాలనపై నూరేళ్ల పోరు తర్వాత, మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడవటం అంటే సాధారణ విషయం కాదు. ఈ సుదీర్ఘకాలంలో అద్భుత ప్రగతిని రుచి చూడటమే కాక దేశం ఎన్నో ఆటుపోట్లనెదుర్కొంది. పంపిణీలో హెచ్చుతగ్గులున్నా గొప్ప సంపద సృష్టించింది. ఆర్థిక అసమానతలు నిత్యం కన్నీరు తెప్పిస్తున్నా పలు విషయాల్లో దేశం అగ్రరాజ్యాల సరసన నిలిచింది. ప్రపంచ నలుమూలలకు యువ మేధోశక్తిని విస్తరించిన మానవవనరుల గనిగా పేరొందింది. ఇవాళ్టి పరిస్థితుల్లో ఇది మాత్రమే చాలదు. ఇంకా ఏదో కావాలి, మరేదో సాధించాలి.  గొప్ప చరిత్ర, అపార వారసత్వ సంపద, విస్తార వనరులు వ్యూహాత్మకంగా నడుచుకుంటే విశ్వాన్ని శాసించగల సత్తా మనకుంది. ‘విశ్వగురు’ కాగల స్థాయి భారత్​ది. 75 ఏండ్ల నడక అనుభవాలతో కొత్త దారులు ఏర్పరచాలి. అవసరమైన అన్ని రంగాల్లో సంస్కరణలు తెచ్చుకోవాలి. రానున్న పాతికేళ్లు వ్యూహాత్మక కార్యాచరణతో సాగితే 2047 లో ఇప్పటికన్నా ఎన్నో రెట్లు అధిక ఉత్సాహంతో  ‘ఇండియా @ 100 ’ అంటూ వేడుకలు జరుపుకునే గొప్ప సువర్ణావకాశం ఏర్పడుతుంది.

సంకల్పమే సగం విజయం

గమ్యమే కాదు మార్గమూ ముఖ్యం అన్నారు గాంధీజీ! పంచవర్ష ప్రణాళికలు, భూసంస్కరణలు, హరిత–శ్వేత–నీలి విప్లవాలు, పేదరిక నిర్మూలన, ఆర్థిక సరళీకరణ, సమ్మిళిత ప్రగతి, గ్రామీణ ఉపాధి హామీ, శ్రమయోగి మాన్​ధన్ యోజన, జన్​ధన్ యోజన ఇలా ఎన్నో కార్యక్రమాలతో సాధించిన ప్రగతి అమోఘం. ఇది మాత్రమే సరిపోదు.  సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ(ఎల్పీజీ)తర్వాత ప్రపంచ గతి మారింది. ఆధునిక శాస్త్ర–సాంకేతికత పుణ్యమా అని వేగం పెరిగింది. ప్రపంచం ఓ కుగ్రామమైంది. మార్కెట్ బలీయశక్తిగా మారింది. బహుళజాతి కంపెనీలు చిన్నపాటి దేశాల విధానాలనే ప్రభావితంచేస్తున్నాయి. మరికొన్ని ట్రాన్స్నేషన్ కార్పొరేట్ల వార్షిక లావాదేవీలు చిన్న దేశాల బడ్జెట్ల కన్నా పెద్దవి. ఈ పరిస్థితుల్లో  సంకుచిత ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా భారత్ వూహాత్మకంగా అడుగులు వేయాలని మేధావివర్గం చెబుతోంది. ముంచుకువస్తున్న పర్యావరణ మార్పు (క్లైమెట్ చేంజ్) ప్రతికూల ప్రభావాల్ని పరిగణనలోకి తీసుకుంటూనే కొన్ని ప్రాధాన్యతాంశాల్లో నిర్దిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఉత్పాదకత  అసాధారణంగా పెంచి దేశమే ఒక హబ్  అవాలి. ఆర్థిక క్రమశిక్షణ విధిగా పాటించాలి. యువశక్తిని గరిష్టంగా వినియోగిస్తేనే ఫలితం. దేశ వ్యవసాయ ముఖచిత్రాన్నే సమూలంగా మార్చాలి. వందేళ్ల పండుగకి దీన్నొక సంకల్పంగా తీసుకోవాలి. వచ్చే పాతికేళ్లు నిష్టతో పనిచేయాలి.

ఫీనిక్స్ పక్షిలా పైకి లేవాలి

ఆర్థికంగా ఇప్పుడున్నది దయనీయ స్థితి. అప్పుల ఊబి నుంచి బయటపడాలి.  అధిక అప్పు మరింత అప్పుకు, ఆ పై దివాలాకు దారితీస్తుంది. కేంద్రం–రాష్ట్రాలు ఈ నిమిషం నుంచే ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవాలి. అప్పులకు 2019–20 లో కేంద్రం కట్టిన వడ్డీలే రూ. 8 లక్షల కోట్లుండటాన్ని ‘కాగ్’ నివేదిక తప్పు బట్టింది. వార్షిక రాబడిలో 37 శాతం వడ్డీలకే కడితే ఇక సంక్షేమం–ప్రగతి ఎలా సాధ్యమౌతాయి? స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో అప్పు 40 శాతాన్ని మించొద్దని (ఎఫ్ఆర్బీఎం) నెత్తీ–నోరూ మొత్తుకొని చెబుతున్నా , అది54 శాతానికి చేరటం దారుణం. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అంతకన్నా ఘోరం. వడ్డీల పెరుగుదల రేటు జీడీపీ పెరుగుదల రేటును మించొద్దు, కానీ అంతటా పరిస్థితి చేయిదాటింది. డబ్బు ఖర్చుపెట్టడంలో అనుచిత ప్రాధాన్యతలే ఈ దుస్థితికి కారణం. ఆధునిక సామ్రాజ్యవాదంలో దేశాలపై భౌతికదాడులుండవు. అప్పులిచ్చి, ఊబిలో దించి ఆ పై కాల్చుకు తినడమే! వెనిజులా వంటి మొన్నటి లాటిన్ అమెరికా దేశాలు, ఇండోనేషియా వంటి నిన్నటి ఆగ్నేయాసియా దేశాలు ఇవాల్టి శ్రీలంక ప్రత్యక్ష ఉదాహరణలు.

విశ్వాన్ని శాసించాలి

కూర్చొని తింటే కొండలైనా కరగుతాయి. ఉత్పత్తులు పెంచకుండా, సేవల్ని విస్తరించకుండా సంపదను వృద్ధిచేయలేం. సంపద సృష్టి ఒక ఎత్తయితే, సంపద పంపిణీ మరొక ఎత్తు. సామాజిక వృద్ధికి, మానవాభివృద్ధి సూచీల్లో ప్రగతికి అదే కీలకం! ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. మొత్తం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఆధారంగా చేసే గణింపు. 2030 నాటికి మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరిస్తామంటారు. ఇది అధిక జనాభాతో సాధ్యమైందే! కానీ, తలసరి జీడీపీ చూస్తే మనది ప్రపంచంలో 134వ స్థానం. కరోనా పుట్టుక, వ్యాప్తికి కారణమయ్యారంటూ చైనాను ప్రపంచమంతా ఈసడించుకున్నపుడు వస్తోత్పత్తి–ఎగుమతులకు ప్రత్యామ్నాయంగా నిలిచే గొప్ప అవకాశం భారత్​కు ఉండింది. జపాన్​తో సహా ఎన్నో దేశాలు తమ పెట్టుబడుల్ని చైనా నుంచి ఉపసంహరించుకొని ఇతర ఉపయుక్త దేశాల కోసం చూశాయి. ఆ అవకాశాల్ని ఇతర దేశాలు తన్నుకుపోయాయి తప్ప భారత్​ సాధించలేకపోయింది. మనకున్న మానవ వనరులు, నదులు–అడవులు వంటి ప్రకృతి సంపద, నైసర్గిక–వాతావరణ పరిస్థితులు సానుకూలత దృష్ట్యా గొప్ప వస్తోత్పత్తి కేంద్రం (హబ్)గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని వాడుకొని ప్రపంచ పెట్టుబడుల్ని ఆకర్శించాలి. ఉత్పత్తులు, సేవలతో విశ్వాన్ని శాసించాలి.

వారికి పెద్దపీటతోనే...

ఇవాళ ప్రపంచంలో అత్యధిక యువ జనాభా (54 శాతం) కలిగిన దేశం భారత్! యువశక్తికి తగిన ప్రాధాన్యత లభించడం లేదు. ఉద్యోగ–ఉపాధి కల్పనలో సర్కార్లు ఘోరంగా విఫలమవుతున్నాయి. ఫలితంగా చాలా చోట్ల తాగుడు, ఇతర  వ్యసనాలకు బానిసలౌతూ, నేరాల్లో మునిగి తేలుతూ, జులాయిల్లా తిరుగుతూ అనుత్పాదక శక్తిగా నిర్వీర్యమౌతున్నారు. అప్పటికే జటిలంగా ఉన్న నిరుద్యోగిత సమస్య రెండేళ్ల కోవిడ్ ప్రభావంతో  పలు రెట్లయిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ గణాంకాలతో చెప్పింది. 2021 డిసెంబరు నాటికి 5.3 కోట్ల మంది నిరుద్యోగులున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పథకం కొంత ఊరటనిచ్చినా పట్టణ–నగర ప్రాంతాల్లో కనీసం ఆ వెసులుబాటు కూడా యువతకు దొరకలేదు. కీలక స్థానాల్లో, విధాన నిర్ణయాల్లోనూ వారికి చోటు కల్పించాలి. అమెరికా, చైనా, జపాన్​, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన సమాజాలు ఏదో ఒక శుభ సందర్భంలో, నిర్ణీత గడువు కాలానికి ‘సంకల్పం’ ప్రకటించుకొని, సాధించి ప్రగతి పథంలో దూసుకుపోయనవే! 
వచ్చే పాతికేళ్లు భారత్​కు గొప్ప అవకాశం!.

రూపురేఖలే మార్చాలి!

దేశ జీడీపీలో వ్యవసాయ వాటా పెంచాలి. రైతుకు రెట్టింపు ఆదాయం దక్కేలా చర్యలు చేపట్టాలి. దేశంలో అత్యధికుల ప్రధాన వ్యాపకంగా ఉన్న వ్యవసాయానికి అవసరమైనంత శ్రద్దాసక్తులు ప్రభుత్వాలు చూపటం లేదు. హేతుబద్దమైన భూ వినియోగ విధానాలుండాలి. ఎరువుల, క్రిమిసంహారకాల అవసరం ఏర్పడని సహజ–ప్రకృతి వ్యవసాయ పద్దతుల్ని ప్రోత్సహించాలి. ఆ మేర సబ్సిడీలు ఇచ్చయినా వ్యవసాయాన్ని నిజాయితీగా ఆదుకోవాలి. ఆ పై వారే దేశాన్ని ఆదుకుంటారు. శాస్త్రీయ పద్దతులు, పరికరాలు, మార్కెట్ సదుపాయాల్ని పెంచాలి. కనీస మద్దతు ధర దాటి గిట్టుబాటు ధర లభించేలా చేస్తే తప్ప వ్యవసాయం బతికి బట్టకట్టదు. ఆహార సరఫరా గొలుసు సజావుగా సాగేటట్టు చూడాలి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకూ అధిక ప్రాధాన్యత ఇచ్చి 
రైతు రాబడి పెంచాలి.

- దిలీప్ రెడ్డి

dileepreddy.r@v6velugu.com