ఎస్​డీఎఫ్​ పనులపై డైలమా.. మొదలు కాని వర్క్స్​పై సర్కార్​ నజర్​

  •   ఎలక్షన్ ​ముందు ఆదరబాదరగా ఫండ్స్​ సాంక్షన్​చేసిన గత ప్రభుత్వం
  •     షూరు కాని పనులను యథాస్థితిలో ఉంచాలని ప్రభుత్వ ఆదేశాలు
  •     కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో 448 పనులు పెండింగ్​

కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎలక్షన్​లో లబ్ధి పొందేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్పెషల్​ డెవలప్​మెంట్​ఫండ్స్​(ఎస్​డీఎఫ్) కింద అనేక పనులకు శాంక్షన్లు ఇచ్చింది. రాష్ట్రంలో అధికారం మారడంతో ఆ పనులపై సందిగ్ధత నెలకొంది. అప్పటి సీఎం కేసీఆర్ ​ఆయా జిల్లాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వెళ్లినప్పుడు, ఎమ్మెల్యేల విన్నపాల మేరకు ​నిధులు శాంక్షన్ ​చేశారు. 

మౌలిక వసతుల కల్పనతో పాటు, కమ్యూనిటీ హాళ్లు, ఆలయాలు, మందిరాల నిర్మాణాల కోసం ఈ నిధులు  కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు కూడా ఈ​ఫండ్స్ శాంక్షన్​ చేశారు. కానీ చాలా వరకు పనులు షురూ కాలేదు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్​ ప్రభుత్వం స్పెషల్​ డెవలప్​మెంట్​ ఫండ్స్​ మంజూరైన పనుల పురోగతి, పెండింగ్​ పనుల వివరాలను శాఖల వారిగా సేకరించింది. ఫండ్స్​శాంక్షన్​ అయి, పనులు షురూ కాని వాటిని యథాస్థితిలో ఉంచాలని సంబంధిత ఆఫీసర్లకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రారంభమైన పనులతో పాటు, ఇంకా స్టార్ట్​కానీ వర్క్స్​పై సందిగ్ధత నెలకొంది.

పరిస్థితి ఇది..

కామారెడ్డి జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2023–24లో రూ.203 కోట్ల స్పెషల్ ​డెవలప్​మెంట్​ఫండ్స్ ​మంజూరు చేశారు. ఫండ్స్​ శాంక్షనైనా ఇంకా సగం పనులు షురూ కాలేదు. ఆర్థిక సంవత్సరం మొదట్లో వచ్చిన ఫండ్స్​కు సంబంధించి పనులు షురూ కాగా, ఎలక్షన్ ​షెడ్యూల్​కు ముందు ఆదరబాదరగా శాంక్షన్లు ఇచ్చిన పనులు ప్రారంభం కాలేదు. కామారెడ్డి టౌన్​కు మొదటగా రూ.25 కోట్లు మంజూరయ్యాయి. వీటితో రోడ్ల వెడల్పు,సెంట్రల్​ లైటింగ్, డివైడర్ల నిర్మాణాలు చేపట్టారు. ఎలక్షన్​ షెడ్యూల్​కు ముందు ఆగస్ట్​లో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు మరికొన్ని ఫండ్స్​శాంక్షన్ ​చేశారు. 

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు రూ.25 కోట్లు, స్పోర్ట్స్​కాంప్లెక్స్, ఇండోర్​ స్టేడియం నిర్మాణానికి రూ.20 కోట్లు, కమ్యూనిటీ హాల్స్, టెంపుల్స్, చర్చిలు, మసీదుల నిర్మాణాలు, రిపేర్ల కోసం మరో రూ.10 కోట్లు ఇచ్చారు. ఎల్లారెడ్డి టౌన్​తో పాటు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మేజర్​ పంచాయతీల్లో అభివృద్ధి పనులకోసం రూ.25 కోట్లు శాంక్షన్​చేస్తున్నట్లు అప్పటి మినిస్టర్​ కేటీఆర్ ​ప్రకటించారు. 

ఈ ఫండ్స్​లో చాలా పనులు ప్రారంభం కాలేదు. కనీసం టెండర్లు కూడా పిలువలేదు. ఎన్నికలకు ముందు కుల సంఘాలు, ఆయా ప్రార్థనా మందిరాలకు ఇచ్చిన వాటిలో కొన్ని పనులు షురువయ్యాయి. ఇంజనీరింగ్​శాఖ వద్ద అగ్రిమెంట్లు అయ్యాయి. అగ్రిమెంట్ ​చేసిన పనులకు సంబంధించి పనులు కొనసాగించవచ్చా లేదా అనే దానిపై సందిగ్ధత ఉంది. ప్రారంభం కాని పనులను మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు ఆపాలని పంచాయతీ రాజ్​శాఖ ఆఫీసర్లకు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. వీటిపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వనుందనే దానిపై స్పష్టత లేదు.

సగం పనులు అట్లనే..

కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఈ ఏడాది రూ.57.51 కోట్ల  స్పెషల్​ ​ఫండ్స్​తో 828 పనులు చేపట్టినట్లు పంచాయతీరాజ్​ఇంజనీరింగ్​ శాఖ ఆఫీసర్లు రిపోర్ట్​ చేశారు. ఇందులో 380 పనులు మాత్రమే ప్రారంభం (గ్రౌండింగ్) అయ్యాయని, 448 పనులు మొదలు పెట్టలేదని ప్రభుత్వానికి రిపోర్ట్​పంపారు.