దేశవ్యాప్తంగా అన్ని లిక్కర్ షాపులను మూసివేస్తే తన మ్యూజిక్ ఈవెంట్స్ లో ఆల్కహాల్ పై సాంగ్స్ పాడటం మానేస్తానని ప్రముఖ పంజాబీ సింగర్, యాక్టర్ దిల్జిత్ దోసాంజ్ స్పష్టం చేశారు. గుజరాత్ లాగా అన్నిరాష్ట్రాలు మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని సవాల్ విసిరారు. “దిల్-లుమినాటి టూర్” లో భాగంగా శనివారం ఆయన హైదరాబాద్ లో మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించారు. అంతకు ముందు దిల్జిత్ దోసాంజ్ కు తెలంగాణ సర్కార్ షోకు సంబంధించి నోటీసులు జారీ చేసింది.
నాతో గొడవ పడకండి
" నేను పాటలు పాడి వెళ్లిపోతాను. అందుకే నాతో గొడవ పడకండి. గత 10 రోజుల్లో నేను పాడిన రెండు భక్తిగీతాల గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఒకటో రెండో పాటలు కాస్త అభ్యంతరకరంగా ఉంటే దానిపై డిబెట్లు పెడుతున్నారు. బాలీవుడ్ ఆర్టిస్టులు మద్యపానాన్ని సమర్థిస్తారు. నేను ఎప్పటికీ సమర్థించను. ఇప్పటికైనా కనీసం నా షో ఉన్న రోజున డ్రై డేగా అమలు చేయండి. అప్పుడు నేనూ మద్యంపై పాటలు పాడను" అని దిల్జిత్ పేర్కొన్నారు.