- పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంజ్ వ్యాఖ్య
- తెలంగాణ సర్కార్ నోటీసుపై తీవ్ర అసంతృప్తి
- అహ్మదాబాద్‌లో మ్యూజిక్ ఈవెంట్ నిర్వహణ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అన్ని లిక్కర్ షాపులను మూసివేస్తే తన మ్యూజిక్ ఈవెంట్స్ లో ఆల్కహాల్ పై సాంగ్స్ పాడటం మానేస్తానని ప్రముఖ పంజాబీ సింగర్, యాక్టర్ దిల్జిత్ దోసాంజ్ స్పష్టం చేశారు. గుజరాత్ లాగా అన్నిరాష్ట్రాలు మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని సవాల్ విసిరారు. “దిల్-లుమినాటి టూర్” లో భాగంగా శనివారం ఆయన హైదరాబాద్ లో మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించారు. అంతకు ముందు దిల్జిత్ దోసాంజ్ కు తెలంగాణ సర్కార్ షోకు సంబంధించి నోటీసులు జారీ చేసింది.
లిక్కర్, డ్రగ్స్, హింసను ప్రోత్సహించే సాంగ్స్ హైదరాబాద్ లో నిర్వహించే షోలో పాడవద్దని అందులో వెల్లడించింది.దాంతో దిల్జిత్ ..శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన మ్యూజిక్ ఈవెంట్ లో తన ఆల్బమ్‌లోని లెమొనేడ్, 5తారా అనే రెండు పాటల్లోని ఒరిజినల్ లిరిక్స్ మార్పు చేసి పాడారు. అనంతరం షోకు వచ్చిన అభిమానులను ఉద్దేశించి దిల్జీత్ మాట్లాడుతూ.. విదేశాల నుంచి వచ్చి పాడే సింగర్లపై ఎలాంటి ఆంక్షలు విధించని తెలంగాణ ప్రభుత్వం తనపై మాత్రం ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు.
గుజరాత్ సర్కార్‌కు అభిమానిని
హైదరాబాద్ ఈవెంట్ తర్వాత దిల్జిత్ ఆదివారం గుజరాత్‌కు వెళ్లారు. అహ్మదాబాద్‌లో మ్యూజిక్ ఈవెంట్ తర్వాత అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.." అహ్మదాబాద్‌లో మ్యూజిక్ ఈవెంట్ కు నాకు ఎలాంటి నోటీసు రాలేదు. నేను ఇక్కడ మద్యంపై ఒక్క పాట కూడా పాడలేదు. ఎందుకంటే గుజరాత్ మద్యపాన నిషేధిత రాష్ట్రం. అందుకే గుజరాత్ ప్రభుత్వానికి నేను అభిమానిని.గుజరాత్ లాగా అన్నిరాష్ట్రాలు మద్యపాన నిషేధాన్ని అమలుచేస్తే నేనూ లిక్కర్ పై సాంగ్స్ పాడకుండా ఉండటానికి రెడీగా ఉన్నాను" అని దిల్జిత్ వివరించారు.
నాతో గొడవ పడకండి
" నేను పాటలు పాడి వెళ్లిపోతాను. అందుకే నాతో గొడవ పడకండి. గత 10 రోజుల్లో నేను పాడిన రెండు భక్తిగీతాల గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఒకటో రెండో పాటలు కాస్త అభ్యంతరకరంగా ఉంటే దానిపై డిబెట్లు పెడుతున్నారు. బాలీవుడ్ ఆర్టిస్టులు మద్యపానాన్ని సమర్థిస్తారు. నేను ఎప్పటికీ సమర్థించను. ఇప్పటికైనా కనీసం నా షో ఉన్న రోజున డ్రై డేగా అమలు చేయండి. అప్పుడు నేనూ మద్యంపై పాటలు పాడను" అని దిల్జిత్ పేర్కొన్నారు.