
అరుదైన కేసుల పరిధిలోకి ఇది వస్తుందని, భయానకతను పరిష్కరించడంలో మరణశిక్ష మాత్రమే ఏకైక శిక్ష అని హైకోర్టు తేల్చి చెప్పింది. కునాల్ మజుందార్ వర్సెస్ రాజస్థాన్ కేసులో కింది కోర్టు విధించిన మరణ శిక్ష ధ్రువీకరణలో హైకోర్టు పాత్ర స్పష్టంగా ఉందని, సీఆర్‌పీసీ సెక్షన్ 367 నుంచి 371 పరిధిలోనే అంశాలను పరిశీలించాల్సి ఉందని తెలిపింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రాగద్వేషాలకు అతీతంగా కేసులోని అంశాల ఆధారంగానే నిర్ణయం వెలువరిస్తున్నామని తెలిపింది. ఉరిశిక్ష పడిన దోషుల్లో ఐఎం సంస్థకు చెందిన అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డి (ఏ-2), జియావుర్ రెహ్మాన్ అలియాస్ వకాస్ (ఏ-3), మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ (ఏ-4), మహమ్మద్ అహ్మద్ సిదిబాపా అలియాస్ యాసిన్ భత్కల్ (ఏ-5), ఐజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండే అలియాస్ సాగర్ అలియాస్ అజీజ్ సయీద్ షేక్ (ఏ-6) ఉన్నారు. దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేస్తూ జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ పి.శ్రీసుధతో కూడిన ధర్మాసనం 357 పేజీల సుదీర్ఘ తీర్పు వెలువరించింది. కాగా, 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని బస్టాప్‌లో, మిర్చిపాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా, మిగిలిన ఐదుగురు నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబరు 13న తీర్పు వెలువరించింది.
నిబంధనల ప్రకారమే దర్యాప్తు
నిబంధనల ప్రకారం దర్యాప్తు జరిగిందని, ఇలాంటి తీవ్రమైన కేసుల్లో ఏవైనా చిన్నచిన్న లోపాలుంటే వాటి ద్వారా నిందితులు లబ్ధి పొందలేరని హైకోర్టు పేర్కొన్నది. పంచనామా నిర్వహణకు రెవెన్యూ అధికారులను పిలిపించడంలో ఎలాంటి అక్రమం జరగలేదని తెలిపింది. పరిస్థితులకు అనుగుణంగా ఆధారాలు, ఇంక్వెస్ట్ పంచులు, నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలను కింది కోర్టు సవ్యంగా పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించిందని తెలిపింది. రెండో నిందితుడైన అసదుల్లా అక్తర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం దోషులు ఏరకంగా జంట పేలుళ్లకు పాల్పడ్డారో.. ఇతర దోషులు, సాక్షుల వాంగ్మూలాలతో పోల్చితే తేలిందని పేర్కొన్నది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ముస్తఫాబాద్‌కు చెందిన జియావుర్ రెహ్మాన్ 25 రోజులపాటు నాసర్ భాయ్ అలియాస్ నసరుల్లా నుంచి తాలిబాన్ శిక్షణ తీసుకున్నారని అక్తర్ వెల్లడించారని తెలిపింది. బాంబుల తయారీ, వాటిని అమర్చడం, ఇతర నిందితుల పాత్రపై ఇచ్చిన వాంగ్మూలం, సాక్షులు, పరిస్థితులకు అనుగుణంగా ఉన్న సాక్ష్యాలతో సరిపోలాయని పేర్కొన్నది. ఆరో నిందితుడైన ఐజాజ్ షేక్ ఐఎం ఉగ్రవాద సంస్థలో కీలక సభ్యుడని, నకిలీ ఐడీ కార్డులను తయారు చేసి ఉగ్రవాదులకు సరఫరా చేస్తుంటారని తెలిపింది. హవాలా ద్వారా సొమ్ము తీసుకుని కుట్ర అమలుకు వినియోగించారని ఆధారాలతో సహా ప్రాసిక్యూషన్ నిరూపించిందని పేర్కొన్నది. పాకిస్తాన్ నుంచి వచ్చిన జియావుర్ రెహ్మాన్ ఐఈడీలను సిద్ధం చేయడంలో, గ్రనేడ్స్, తుపాకులు, గన్ లు, ఏకే 47 వినియోగించడంలో సిద్ధహస్తుడని ప్రాసిక్యూషన్ ఆధారాలు సమర్పించిందని తెలిపింది.
బాధిత కుటుంబాల సంబురాలు
దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించడంపై బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తంచేశాయి. బాంబు పేలుడు ఘటనా స్థలిలో సంబురాలు చేసుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న బాధితులు, నాటి ప్రత్యక్ష సాక్షులు హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని ఉత్కంఠతో ఎదురుచూశారు. దోషులకు ఉరిశిక్ష ను సమర్థిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. బాంబు పేలుళ్లు జరిగిన ఏ1 మిర్చి పాయింట్ వద్ద స్వీట్లు పంచారు. నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించి, కేసును సాగదీయకముందే తక్షణమే ఉరిశిక్షను అమలుపరచాలని డిమాండ్‌చేశారు. దోషులకు ఉరి శిక్షే సరి అంటూ నినదించారు. ఈ సందర్భంగా దిల్ సుఖ్ నగర్ ఏ1 టిఫిన్ సెంటర్ వద్ద బ్లాస్ట్ బాధితులు బక్కారెడ్డి, ఏ1 టిఫిన్ సెంటర్ యజమాని పాండు రెడ్డి, గోకుల్ చాట్ బ్లాస్ట్ బాధితుడు రహీం, ప్రత్యక్ష సాక్షులు బ్యాంగిల్ స్టోర్ యజమాని రామకృష్ణ ఘటనా స్థలి వద్దకు చేరుకుని మృతులకు నివాళులర్పించారు.
న్యాయం చేయాలని వేడుకోలు
జంట పేలుళ్లలో చనిపోయిన కుటుంబాలకు కొంత ఆర్థిక సాయం చేసినా.. గాయపడిన వారికి చికిత్స కోసం నాటి సర్కారు రూ. లక్ష మాత్రమే ఇచ్చింది. తర్వాత ఖర్చు అంతా బాధితులపైనే వదిలేసింది. ఇప్పటికీ చాలా మంది అవయవాలు, మతిస్థిమితం కోల్పోయి అవస్థలు పడుతున్నారు. మందులకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల కుటుంబాలు వేడుకుంటున్నాయి.
ఏం జరిగిందంటే..?
కుక్కర్ బాంబులతో విధ్వంసం ఐఎంకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రియాజ్ భత్కల్ పాకిస్తాన్ కేంద్రంగా దేశంలో విధ్వంసాలకు వ్యూహరచన చేశాడు. బాబ్రీ మజీద్ కూల్చివేతకు ప్రతీకారంగా వారణాసి, ఫైజాబాద్(అయోధ్య), లక్నోలో వరుస బ్లాస్టింగ్‌కు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు ప్లాన్ వేశాడు. తన సొంత రాష్ట్రమైన కర్నాటకలో భత్కల్ ‘ఉసద’ పేరుతో ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించాడు. హైదరాబాద్‌లో పేలుళ్లు జరిపేందుకు 2013 జనవరి చివరి వారంలో కొంత మంది మంగళూర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. అబ్ధుల్లాపూర్ మెట్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలోనే యాసిన్ భత్కల్, అసదుల్ల అక్తర్ అలియాస్ హడ్డి, జియా ఉర్ రహ్మమాన్ అలియాస్ వకాస్, మహ్మద్ తహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్ రెక్కీ నిర్వహించారు.
సైకిళ్లకు కుక్కర్ బాంబులు అమర్చి..
2013 ఫిబ్రవరి 20న యాసిన్ భత్కల్ సహా ముగ్గురు ఉగ్రవాదులు ఎల్బీనగర్‌లోని మహాలక్ష్మీ ఫ్యాన్సీ స్టీల్ షాప్‌లో ఏడున్నర లీటర్ల కెపాసిటీతో ఉన్న రెండు కుక్కర్లు కొనుగోలు చేశారు. వీటిలో పేలుడు పదార్ధాలు(ఐఈడీ) నింపారు. మలక్‌పేట్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ సైకిల్ రిపేర్ షాపు వద్ద పాత సైకిల్, ఛాదర్‌ఘాట్ బ్రిడ్జి సమీపంలోని షాపులో ప్లాస్టిక్ టేప్ కొనుగోలు చేశారు. ఫిబ్రవరి 21న జుమ్మెరాత్ బజార్‌కు వెళ్లారు. మరో పాత సైకిల్ కోనుగోలు చేశారు. ఈ సైకిల్‌ను మలక్‌పేట్ రైల్వే స్టేషన్ పార్కింగ్ స్టాండ్‌లో పార్క్ చేశారు. అబ్దుల్లాపూర్ మెట్‌లోని ఇంట్లో కుక్కర్ బాంబులు తయారు చేశారు.
6 సెకన్ల వ్యవధిలో రెండు పేలుళ్లు
ఫిబ్రవరి 21న సాయంత్రం 7 గంటలకు బ్లాస్ట్ అయ్యేలా టైమ్ ఫిక్స్ చేశారు. సాయంత్రం 4 గంటలకు అబ్దుల్లాపూర్ నుంచి బయలుదేరి మలక్‌పేట్ వచ్చారు. అక్కడ రెండు సైకిళ్లకు కుక్కర్ బాంబులను అమర్చారు. వాటిని దిల్‌సుఖ్‌నగర్‌కు తరలించారు. 107 బస్ స్టాప్ వద్ద, కోణార్క్ థియేటర్‌కు ఎదురుగా ఉన్న ఏ1 మిర్చి సెంటర్ వద్ద సైకిళ్లను పార్క్ చేశారు. సరిగ్గా సాయంత్రం 6 గంటల 58 నిమిషాల 38 సెకన్లకు ఒక బాంబు, 6 గంటల 58 నిమిషాలకు మరో బాంబు పేలింది. ఈ పేలుళ్లలో కడుపులో ఉన్న బిడ్డ సహా మొత్తం 17 మంది మృతి చెందారు. 131 మంది తీవ్రంగా గాయపడ్డారు.
2016 డిసెంబర్‌లో ఉరిశిక్ష ఖరారు
మలక్‌పేట్, సరూర్‌నగర్ పీఎస్‌లలో నమోదైన కేసుల ఆధారంగా 2013 మార్చి 14న ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. నిందితులను కోర్టుకు తరలించే సమయంలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో చర్లపల్లి జైల్లోనే ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు.ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్‌తో విచారణ జరిపారు. మొత్తం 157 మంది సాక్షుల వాంగ్మూలాలను, 201 బ్లాస్టింగ్ మెటీరియల్‌ను కోర్టు పరిశీలించింది. ఈ కేసులో 2016 డిసెంబర్‌లో ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించింది. యాసిన్ భత్కల్ సహా ఐదుగురిని దోషులుగా తేలుస్తూ ఉరిశిక్ష విధించింది.