
హైదరాబాద్: దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష సరైనదేనని తీర్పు వెల్లడించింది. NIA ట్రయల్ కోర్టు విధించిన తీర్పును హైకోర్టు సమర్థించింది. కాగా, దిల్సుఖ్ నగర్లో మారణహోమం సృష్టించిన నిందితులకు 2016 డిసెంబర్ 13న ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఎన్ఏఐ కోర్టు తీర్పును నిందితులు తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు.
ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఏఐ కోర్టు జారీ చేసిన ఆదేశాలను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు 2025, ఏప్రిల్ 8న తుది తీర్పు వెలువరించింది. నిందితులకు ఉరి శిక్ష విధిస్తూ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. దీంతో నిందితులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని నిందితుల తరుపు న్యాయవాదులు తెలిపారు. నెల రోజుల్లో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. దీంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
►ALSO READ | OMG: రైల్వే ఉద్యోగులకు కూడా బ్రీత్ ఎనలైజర్ టెస్టులు
2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బస్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల గ్యాప్లోనే రెండు పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబ్ పేలిన కొద్దిసేపటికే.. 150 మీటర్ల దూరంలోనే మరో బ్లాస్ట్ సంభవించింది. టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి.. టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. పేలుళ్ల ధాటికి 17 మంది మరణించగా, దాదాపు 130 మందికిపైగా గాయపడ్డారు.బ్లాస్ట్ కేసును NIA దర్యాప్తు చేసింది.
ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ (యూపీ), జియా-ఉర్-రెహమాన్ (పాకిస్థాన్), తెహసీన్ అక్తర్ (బీహార్), అజాజ్ షేక్ (మహారాష్ట్ర) కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా, మిగిలిన అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఘాస్, మహమ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్, మహమ్మద్ అహ్మద్ సిద్ధిబప అలియాస్ యాసిన్ భత్కల్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండె అయిదుగురికి ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది.