Dimuth Karunaratne: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక మాజీ కెప్టెన్

Dimuth Karunaratne: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక మాజీ కెప్టెన్

శ్రీలంక మాజీ కెప్టెన్ దిముత్ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో గాలేలో జరిగే రెండో టెస్ట్ తన కెరీర్ లో చివరి టెస్ట్ అని ఈ శ్రీలంక ఓపెనర్ మంగళవారం (ఫిబ్రవరి 4) తన నిర్ణయాన్ని తెలిపాడు. ఫిబ్రవరి 6న శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇది అతని కెరీర్ లో 100 టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్ తర్వాత కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడు.

దశాబ్ద కాలంగా కరుణరత్నే శ్రీలంక తరపున టెస్టుల్లో అద్భుతంగా రాణించాడు. గత కొంతకాలంగా పరుగులు చేయడంలో విఫలమవుతున్నాడు.  ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో దిముత్ కరుణరత్నే వరుసగా 7, 0 పరుగులు చేశాడు. దీంతో జట్టుకు తాను భారం కాకూడదనే ఉద్దేశ్యంతో తప్పుకుంటున్నాడు. 14 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ టెస్ట్ కెరీర్ లో ఎన్నో కీలక ఇన్నింగ్స్ లు ఆడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కెరీర్ లో ఇప్పటివరకు 99 టెస్టులాడిన ఈ లంక ఓపెనర్ 189 ఇన్నింగ్స్ ల్లో 39 యావరేజ్ తో 7172 పరుగులు చేశాడు. 50 వన్డేల్లో 1316 పరుగులు చేశాడు. 

ఫిబ్రవరి 6న ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టెస్ట్ కరుణరత్నే కెరీర్ లో 100 వది. శ్రీలంక తరపున ఈ ఘనత సాధించిన ఏడవ  క్రికెటర్‌గా అవతరిస్తాడు. సనత్ జయసూర్య (110), ముత్తయ్య మురళీధరన్ (132), చమిందా వాస్ (111), కుమార్ సంగక్కర (134), మహేల జయవర్ధనే (149), ఏంజెలో మాథ్యూస్ (117) కరుణరత్నే కంటే ముందు 100 టెస్ట్ మ్యాచ్ లాడారు. 36 ఏళ్ళ కరుణరత్నే టెస్టుల్లో 16 సెంచరీలతో పాటు 39 హాఫ్ సెంచరీలు చేశాడు. శ్రీలంక టెస్ట్ జట్టుకు 30 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా చేశాడు.