SA20: సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్‌లో దినేష్ కార్తీక్.. ఏ జట్టు తరపున అంటే..?

SA20: సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్‌లో దినేష్ కార్తీక్.. ఏ జట్టు తరపున అంటే..?

బెట్ వే సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా దినేష్ కార్తీక్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అరుదైన గౌరవం దక్కిన వెంటనే వెటరన్ బ్యాటర్ కు మరో బంపర్ ఆఫర్ లభించింది. అతను తొలిసారి సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. మూడో సీజన్ కోసం పార్ల్ రాయల్స్ తరపున కార్తీక్ జట్టులో చేరతాడు. ఈ విషయాన్ని పార్ల్ రాయల్స్ మంగళవారం (ఆగస్ట్ 6) అధికారికంగా ప్రకటించింది. దీంతో సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ లో ఆడే తొలి ప్లేయర్ గా దినేష్ కార్తీక్ నిలిచాడు. 

"చాలా అనుభవం, నాణ్యతతో కూడిన పార్ల్ రాయల్స్ జట్టులో చేరినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ జట్టులో చేరడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాను. దక్షిణాఫ్రికాలో నాకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. తిరిగి పోటీ క్రికెట్ ఆడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది". అని కార్తీక్ అన్నాడు. జనవరి 9 నుంచి సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభమవుతుంది.   

ఇటీవలే దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కు  రిటైర్మెంట్ ప్రకటించారు. మే22 బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో  బెంగళూరు ఓడిన అనంతరం కార్తీక్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. గ్రౌండ్ లో ఆయనకు ఆర్సీబీ ప్లేయర్లు, అభిమానులు ఘన వీడ్కోలు పలికారు. మైదానం నుంచి డగౌట్‌కు వెళుతుండగా.. కార్తీక్ తన గ్లౌజులు తీసి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కామెంట్రీ చేస్తూ బిజీగా మారిపోయాడు.  

దినేష్ కార్తీక్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ (2008-2010, 2014)తో ప్రారంభించాడు, ఆ తర్వాత అతను పంజాబ్ కింగ్స్ (2011), ముంబై ఇండియన్స్ (2012-2013), గుజరాత్ లయన్స్ (2016-2017), కోల్‌కతా నైట్ రైడర్స్ (2016 2017 ) కోల్‌కతా నైట్‌ రైడర్స్ (2018-2021)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2015, 2022-2024) తరుపున ఆడాడు. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు కార్తీక్. 2013లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు కార్తీక్ ఆ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.