టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ తన ఐపీఎల్ కెరీర్ ముగించబోతున్నట్లు వార్తా సంస్థ పిటిఐ(PTI) నివేదించింది. ఈ సీనియర్ ప్లేయర్ స్వతహాగా తన రిటైర్మెంట్ ప్రకటించకపోయినా.. 2024 ఐపీఎల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం కార్తీక్ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు. గత సీజన్ లో విఫలమైనా ఆర్సీబీ యాజమాన్యం ఈ వికెట్ కీపర్ పై నమ్మకముంచింది.
ఐపీఎల్ లో ఇప్పటివరకు కార్తీక్ ఆరు ఫ్రాంచైజీల తరపున ఆడాడు. ఐపీఎల్ ప్రారంభ టర్న్ నుంచి ఇప్పటివరకు ఆడుతున్న అతి కొద్ది మంది క్రికెటర్లలో దినేష్ కార్తీక్ ఒకడు. ఈ లిస్ట్ లో ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహా, మనీష్ పాండే ఉన్నారు. 2008లో తిలి సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడాడు. ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (2011), ముంబై ఇండియన్స్ (2012-13), గుజరాత్ లయన్స్ (2016-17), నైట్ రైడర్స్ (2018-21), రాయల్ ఛాలెంజర్స్ (2015, 2022, 2023) తరపున ప్రాతినిధ్యం వహించాడు.
బెంగళూరు జట్టు తరపున అద్భుత ప్రదర్శనతో భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. 2022 టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాలో చోటు సంపాదించాడు. అయితే ఈ టోర్నీ తర్వాత ఇతనికి భారత జట్టులో చోటు దక్కలేదు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 242 మ్యాచ్‌ల్లో 4516 పరుగులతో ఈ లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో పదో స్థానంలో ఉన్నాడు. ధోనీ, రోహిత్ శర్మ తర్వాత అత్యధిక మ్యాచ్ లు ఆడిన రికార్డ్ కార్తీక్ పేరు మీదే ఉంది.