
కట్టుకున్న భార్య మోసం చేసినా... స్నేహితుడు నమ్మకద్రోహం చేసినా..కెరియర్ లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా..ఎదురొడ్డి నిలబడ్డాడు దినేష్ కార్తీక్. ఎత్తు పల్లాలను దాటుతూ శిఖరానికి చేరుకున్నాడు. తన కలను నెరవేర్చుకోబోతున్నాడు. ఐపీఎల్ 2022లో అదరగొడుతున్న దినేష్ కార్తీక్..త్వరలో టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఐపీఎల్ లో 13 మ్యాచుల్లో 285 పరుగులు చేయడంతో అతన్ని జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్ గట్టిగానే వినిపిస్తోంది. మాజీ క్రికెటర్లు, అభిమానుల మద్దతు దినేష్ కార్తీక్ కు రోజు రోజుకు పెరుగుతుండటంతో సెలక్టర్లు అతన్ని సెలక్ట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అతని విజయం వెనుక ఒడిదుడుకులెన్నో:
దినేష్ కార్తీక్ ను ఎప్పుడు చూసినా..అతని కంటే ముందు చిరునవ్వు మనల్ని పలకరిస్తుంది. అయితే కార్తీక్ చిరునవ్వు వెనకాల చెప్పుకోలేని బాధ దాగి ఉంది. ఒక మహిళ మోసం...ప్రాణ స్నేహితుడి ద్రోహం..మరో స్త్రీ పరిచయంతో మళ్లీ సంతోషం..ఇది సింపుల్ గా చెప్పాలంటే దినేష్ కార్తీక్ కష్టాల వెనక ఉన్న అసలు కారణం. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పరుగుల వరద పారించిన దినేష్ కార్తీక్..2004లో భారత జట్టుకు ఎంపికయ్యాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అనేది కార్తీక్ కల. అది నెరవేరడంతో .. 2007లో తన చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజారాను వివాహం చేసుకున్నాడు. నికితా తండ్రి, దినేశ్ కార్తీక్ తండ్రి ఇద్దరూ మంచి స్నేహితులు. అంతేకాకుండా నిఖితా, దినేష్ కార్తీక్ చిన్నప్పటి నుంచి కలిసి పెరగడంతో...వీరిద్దరికి కుటుంబ సభ్యులు వివాహం చేశారు. ముంబైలో ఘనంగా జరిగిన వివాహ వేడుకకు..ఎంతో మంది క్రికెటర్లు హాజరై .. అశీర్వదించారు.
ప్రాణ స్నేహితుడి నమ్మక ద్రోహం:
టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్, దినేష్ కార్తీక్ చిన్ననాటి నుంచే మంచి స్నేహితులు. తమిళనాడు జట్టుకు వీరిద్దరు ప్రాతినిధ్యం వహించారు. రంజీ ట్రోఫీలో తమిళనాడు జట్టుకు దినేష్ కెప్టెన్‌గా కాగా...మురళీ విజయ్ ఓపెనర్. అయితే మురళీ విజయ్ కంటే ముందుగా దినేష్ కార్తీక్ టీమిండియాకు ఎంపికయ్యాడు. మంచి స్నేహితులు కావడంతో..కార్తీక్ పెళ్లికి కూడా మురళీ విజయ్ హాజరయ్యాడు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ ఇంటికి మురళీ విజయ్ అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు. అలా నిఖితకు దగ్గరైన మురళీ విజయ్..కార్తీక్ లేని సమయంలో నికితను కలిసేవాడు. నికితకు మురళీ విజయ్ అంటే ఇష్టం ఏర్పడింది. ఈ విషయాన్ని దినేష్ కార్తీక్ గుర్తించలేకపోయాడు. నికిత, మురళి మధ్య సంబంధం మరింత బలపడి..అది వివాహేతర సంబంధంగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ బహిరంగంగా కలవడం మొదలుపెట్టారు. మురళీ విజయ్ తన కెప్టెన్ దినేష్ భార్య నికితతో ప్రేమలో ఉన్నాడని దినేష్ కార్తీక్ కు తప్ప... తమిళనాడు టీమ్ మొత్తానికి తెలిసింది. 2012లో తమిళనాడు విజయ్ హాజారే ట్రోఫీలో కర్ణాటకతో మ్యాచ్ ఆడుతున్న సమయంలో తన భార్యకు మురళీ విజయ్‌కి ఉన్న వివాహేతర సంబంధం గురించి దినేష్ కార్తీక్ కు తెలిసింది. దీంతో ఒక్కసారిగా కార్తీక్ కుప్పకూలిపోయాడు. భార్య చేసిన మోసం..నమ్మిన స్నేహితుడు చేసిన ద్రోహాన్ని అతను తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత నికితకు విడాకులు ఇచ్చాడు. దినేశ్ కార్తీక్ తో విడాకులు తీసుకున్న తర్వాత నికిత గర్భవతి అని తెలిసింది. అయితే అందుకు తానే కారణమని తెలుసుకున్న మురళీ విజయ్.. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ప్రస్తుతం ముగ్గురు పిల్లలు.
కార్తీక్ జీవితంలో వెలుగులు నింపిన దీపికా పల్లికల్:
స్నేహితుడి ద్రోహం, భార్య చేసిన మోసంతో దినేష్ కార్తీక్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఇద్దరు చేసిన నమ్మక ద్రోహాన్ని మర్చిపోలేక..మద్యానికి బానిసయ్యాడు. సరిగ్గా ఆడకపోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫిలో విఫలం అవడంతో..కెప్టెన్సీ కోల్పోయి..టీమ్ నుంచి తొలగించబడ్డాడు. ఆ తర్వాత కెప్టెన్ గా మురళీ విజయ్ ఎంపికయ్యాడు. వైఫల్యం కారణంగా ఐపీఎల్‌లోనూ చోటు దక్కలేదు. ఒకానోక సమయంలో సూసైడ్ చేసుకుందామనుకున్నాడు. అయితే దినేష్ కార్తీక్ పరిస్థితిని తెలుసుకున్న జిమ్ ట్రైనర్ అతని ఇంటికి వచ్చి..ధైర్యాన్ని నూరిపోశాడు. కార్తీక్ ను జిమ్ కు తీసుకెళ్లి..అతన్ని మార్చే ప్రయత్నాన్ని ప్రారంభించాడు. అదే జిమ్ కు వచ్చే ఇండియన్ స్క్వాష్ ప్లేయర్ దీపికా_పల్లికల్..దినేష్ కార్తీక్ పరిస్థితిని చూసి చలించిపోయింది. ట్రైనర్‌తో కలిసి దినేష్ కార్తీక్‌కు ఆమె కూడా కౌన్సెలింగ్ ఇవ్వడం ప్రారంభించింది. దీపికా పల్లికల్ చెప్పిన మాటలతో దినేష్ కార్తీక్ తో మళ్లీ క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ లో రాణించాడు. దాని ఫలితంగా ఐపీఎల్ కు సెలక్ట్ అయ్యాడు. అంతేకాదు..ఏకంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా నియమించబడ్డాడు. దీపికా పల్లికల్ తో పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఆమెను పెళ్లాడాడు. వీరిద్దరికి కవలలు జన్మించారు.
దినేష్ కార్తీక్ క్రికెట్ కెరియర్ కు ఐపీఎల్ 2022 సంజీవని:
2021 ఐపీఎల్ ఫైనల్లో ఓటమితో కోల్ కతా టీమ్ ..దినేష్ కార్తీక్ ను రిటేయిన్ చేసుకోలేదు. దీంతో అతను వేలంలో పాల్గొనాల్సిన పరిస్ధితి ఏర్పడింది. 2022 IPL వేలంలో దినేష్ కార్తీక్ ను రాయల్ ఛాలెంజర్ బెంగళూరు కొనుగోలు చేసింది. కొత్త జట్టులో చేరిన తర్వాత దినేష్ కార్తీక్ ఫర్ఫామెన్స్ అదుర్స్. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ..మాంచి ఫినిషర్ గా ఎదిగాడు. 13 మ్యాచుల్లో 68 సగటుతో 285 పరుగులు చేశాడు. 37 ఏళ్ల వయసులో కుర్రాళ్లకు దీటుగా పరుగుల వరద పారించాడు. టీమిండియాకు ఎంపికయ్యే ప్లేయర్ల లిస్టులో టాప్ లో నిలిచాడు. దీనేష్ కార్తీక్ ఆటతీరుపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాబోయే టీ-20 వరల్డ్ కప్ లో కార్తీక్ ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి. రిషబ్ పంత్ కంటే ఎంతో అనుభవం ఉన్న దినేష్ కార్తీక్ టీమిండియాలో ఉండటం వల్ల జట్టుకు మేలు జరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ధోని ప్లేస్ ను బర్తీ చేయగల సత్తా దినేష్ కార్తీకే ఉంది:
వచ్చేది టీ-20 వరల్డ్ కప్..పొట్టి క్రికెట్ లో కప్ గెలవాలంటే కావాల్సింది ఆల్ రౌండర్లు, మంచి ఫినిషర్లు. ప్రస్తుతం జట్టులో శార్దూల్, అక్షర్, జడేజా లాంటి ఆల్ రౌండర్లకు కొదవ లేదు. మరి ఫినిషర్ ఎవరున్నారంటే టక్కున సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియాలో నిఖార్సైన ఫినిషర్ లేడు కాబట్టి. ధోని ఉన్నంత కాలం అతను 7వ నెంబర్ లో వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్ లతో మంచి ఫినిషింగ్ ఇచ్చేవాడు. అందుకే ధోని వరల్డ్ బెస్ట్ ఫినిషర్ గా పేరు సంపాధించాడు. ధోని రిటైర్ అయ్యాక మరో క్రికెటర్ ఫినిషర్ భారత్ కు దొరకలేదు. అయితే ఐపీఎల్ 2022 ఫుణ్యమా అని టీమిండియాకు దినేష్ కార్తీక్ రూపంలో మంచి ఫినిషర్ దొరికాడని క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 8 బంతుల్లో 30 పరుగులు చేసి మ్యాచ్ ను లాగేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ పై 14 బంతుల్లోనే 32 రన్స్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ పై 23 బాల్స్ లోనే 44 పరుగులు సాధించాడు. చెన్నైపై 14 బంతుల్లో 34 పరుగులు చేయడంతో పాటు..ఢిల్లీ కాపిటల్స్ పై 34 బంతుల్లో 66 రన్స్ కొట్టాడు. జట్టు కష్ట సమయాల్లో బెస్ట్ ఇన్నింగ్స్ లతో మంచి ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. అటు కార్తీక్ ఆటతీరు పట్ల బీసీసీఐ సెలక్టర్లు సంతృప్తితో ఉన్నారు. త్వరలో సౌతాఫ్రికాతో జరగనున్న టీ-20 సిరీస్ కు అతన్ని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.
దినేష్ కార్తీక్ ను మోసం చేసిన మురళీ విజయ్ ఏమయ్యాడు:
నమ్మిన స్నేహితుడిని మోసం చేసిన మురళీ విజయ్..మొదట్లో క్రికెట్ లో ఎదిగినా..ఆ తర్వాత పాపం పండి క్రికెట్ కే దూరమయ్యాడు. ఫాంలేమి కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో రాణించకపోవడంతో చెన్నై యాజమాన్యం అతన్ని జట్టు నుంచి తప్పించింది. చివరగా 2015లో వన్డే, టీ-20, 2018లో టెస్టు మ్యాచ్ ఆడాడు. మొత్తానికి మోసం, నమ్మక ద్రోహం చేసిన మురళీ కార్తీక్ మొదట్లో సుఖ పడ్డా..ఆ తర్వాత ఓడిపోయాడు. స్నేహితుడు, భార్య చేసిన మోసంతో మొదట్లో దినేష్ కార్తీక్ తడబడ్డా.....ఆ తర్వాత నిలబడి..ఇవాళ జీవితంలో విజయం సాధించాడని క్రికెట్ ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు.
మరిన్ని వార్తల కోసం
కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో లక్షలు దోచుకుంటున్నరు