విద్యను కాషాయీకరణం చేసే కుట్ర : ఏఐఎస్‌ఎఫ్​

విద్యను కాషాయీకరణం చేసే కుట్ర : ఏఐఎస్‌ఎఫ్​
  • అందుకే యూజీసీ ముసాయిదా తీసుకొచ్చారు

హైదరాబాద్, వెలుగు: విద్యా కాషాయీకరణలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం యూజీసీ ముసాయిదాను తీసుకొచ్చిందని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ సిరంగరాజ్ అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పేరుతో విద్యను పూర్తిగా తన ఆధిపత్యంలోకి తీసుకోవాలని నిర్ణయించిందని ఆరోపించారు. యూజీసీ గైడ్ లైన్స్‌తో పూర్తిగా ఉన్నత విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ సర్కారు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌‌లో జరిగిన ఏఐఎస్‌ఎఫ్ జాతీయ సమితి సమావేశానికి ఆ సంఘం జాతీయ అథ్యక్షుడు విరాజ్ దేవాంగ్ అధ్యక్షత వహించారు.

 ఈ సందర్భంగా దినేశ్‌ మాట్లాడుతూ.. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. వర్సిటీల్లో ఆర్ఎస్‌ఎస్ ఎజెండా అమలుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నదని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం10 శాతం నిధులు, జీడీపీలో 6 శాతం నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్‌ఏ స్టాలిన్, సంఘమిత్ర జెనా, జాతీయ సహాయ కార్యదర్శులు కె.శివారెడ్డి, కబీర్, హమిమ్ హంజా, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.