డైనోసార్లను ఎవరూ చూడకపోయినా అవి ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అవి భూమ్మీద బతికిన అతి పెద్ద జీవులు. అయితే.. అవి అంతరించిపోయినా.. వాటి గుడ్ల ఫాసిల్స్ అక్కడక్కడా దొరుకుతుంటాయి. ఈ మధ్యే మధ్య ప్రదేశ్‌లోని సెంధ్వా జిల్లాలో హింగ్వా గ్రామానికి దగ్గరలో దాదాపు 145 నుంచి 66 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ గుడ్లు దొరికాయి. అవి క్రిటేషియస్ కాలం నాటివని ఆర్కియాలజిస్ట్‌లు చెప్తున్నారు. అక్కడ దొరికిన పది గుడ్లలో ఒకటి 40 కిలోలు ఉంది. మిగతావి దాదాపు 25 కిలోల వరకు బరువు ఉన్నాయి. వీటిని మ్యూజియంలో పెట్టేందుకు ఇండోర్‌కి తీసుకెళ్లారు.
రాళ్లు కూడా అయ్యుండొచ్చు!
ఈ గుడ్లను చూసిన కొందరు జియాలజిస్ట్‌లు(భూగర్భ శాస్త్రవేత్తలు).. ‘‘ఇవి ఫాసిల్ ఎగ్స్ అని కచ్చితంగా చెప్పలేం’’ అన్నారు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి పాత బసాల్టిక్ శిలలు కూడా ఈ ఆకారంలో ఉండే అవకాశం ఉందని వాళ్లంటున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, పాలియోంటాలజిస్ట్ డాక్టర్ ధనుంజయ్ మొహబే మాట్లాడుతూ.. “ఈ ఆబ్జెక్ట్స్ డెక్కన్ అగ్నిపర్వతానికి చెందిన బసాల్టిక్ శిలల్లా కనిపిస్తున్నాయి. వీటికున్న ‘ఆనియన్ పీల్ వెదరింగ్’ కొన్ని బసాల్టిక్ శిలలకు ఉండే అవకాశం ఉంది’ అన్నారు. కానీ.. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ మాత్రం ఇవి డైనోసార్ గుడ్లని చెప్తోంది. దీన్ని బట్టి చూస్తే వీటిపై మరికొంత రీసెర్చ్ చేస్తే తప్ప అసలు విషయం తేలేలాలేదు.