వ్యవసాయంలో డిప్లొమా కోర్సులు

ప్రొఫెసర్​ జయశంకర్​ తెలంగాణ స్టేట్​ అగ్రికల్చర్​ యూనివర్శిటీ.. 2019–20 విద్యా సంవత్సరానికి వివిధ వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనలు విడుదల చేసింది. వీటి ద్వారా అగ్రికల్చర్​ డిప్లొమాలు, బీఎస్సీ అగ్రికల్చర్​, బీటెక్​ అగ్రికల్చర్​ ఇంజినీరింగ్​,  బీటెక్​ ఫుడ్​ టెక్నాలజీలో అడ్మిషన్ కల్పిస్తారు. కొన్ని కోర్సులకు పదోతరగతి అర్హత కాగా కొన్నింటికి తెలంగాణ ఎంసెట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. మిగిలిన వాటికి డిప్లొమా అర్హతతో పాటు ఎంట్రన్స్​ టెస్ట్ రాయాలి.

గ్రామీణ విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రొఫెసర్‍ జయశంకర్‍ తెలంగాణ స్టేట్‍ అగ్రికల్చర్‍ యూనివర్శిటీ అగ్రికల్చర్​ పాలిటెక్నిక్​లను నిర్వహిస్తుంది. వ్యవసాయం (అగ్రికల్చర్​), విత్తన సాంకేతిక పరిజ్ఙానం (సీడ్​ టెక్నాలజీ), సేంద్రీయ వ్యవసాయం (ఆర్గానిక్​ ఫార్మింగ్​) లో 2 సంవత్సరాలు, అగ్రికల్చరల్‍ ఇంజినీరింగ్‍లో మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తోంది. జూలై 4 వరకు ఆన్‍లైన్‍లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత

ఒకటి నుంచి పదోతరగతి వరకు ఏవైనా 4 సంవత్సరాలు రాష్ర్టంలోని గ్రామీణ ప్రాంతాల్లోని (నాన్‍ మున్సిపల్ పరిధి) పాఠశాలలో చదివిన వారు అర్హులు. ఇందుకుగాను వారి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధృవపరిచిన ఫాంను అప్‍లోడ్‍ చేయాలి. జనరల్‍ అభ్యర్థులు 5.0 గ్రేడ్‍, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‍లు 4.0 గ్రేడ్‍ (హిందీతో కలిపి) సాధించాలి. పదో తరగతిలో కంపార్ట్ మెంట్‍లో ఉత్తీర్ణులైన వారు, ఇంటర్మీడియట్‍ ఫెయిలైన వారు కూడా అర్హులే. ఇంటర్​ లేదా ఆ పై విద్యార్హతలు కలిగిన వారు అనర్హులు.

వయసు

2019 డిసెంబర్‍ 31 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. (అంటే 1997 డిసెంబర్‍ 31 నుంచి 2004 డిసెంబర్‍ 31 మధ్య జన్మించినవారు అర్హులు)

ఫీజు వివరాలు

అప్లికేషన్ ఫీజు కింద జనరల్​/బీసీలు రూ.1100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‍ కేటగిరీ వాళ్లకు రూ.600. కోర్సుకు ప్రభుత్వ పాలిటెక్నిక్​లయితే సెమిస్టర్​కు రూ.12700, ప్రైవేటు ఇన్​స్టిట్యూట్​లలో సెమిస్టర్​ కు రూ.17000 చెల్లించాలి. హాస్టల్​వసతికి వేరుగా పే చేయాలి

కాలవ్యవధి

రెండేళ్ల కోర్సుల్లో ఏడాదికి రెండు చొప్పున నాలుగు సెమిస్టర్లుంటాయి. వీటిని మూడేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే అడ్మిషన్​ రద్దవుతుంది. మూడేళ్ల అగ్రికల్చరల్‍ ఇంజినీరింగ్‍లో మొత్తం ఆరు సెమిస్టర్లుంటాయి. నాలుగేళ్లలో కోర్సు పూర్తి చేయలేకపోతే అడ్మిషన్ రద్దు చేస్తారు.

దరఖాస్తు ఎలా..

ఫోన్‍ నెంబర్‍ సాయంతో వెబ్‍సైట్‍లో ఓటీఆర్‍(వన్‍ టైం రిజిస్ట్రేషన్‍) చేసుకోవాలి. పాస్‍పోర్ట్ సైజ్‍ ఫోటో (3.5 సెం.మీ. × 4.5 సెం.మీ.) మరియు సంతకం (జేపీజీ/జేపీఈజీ/పీఎన్‍జీ ఫార్మాట్​ 1 ఎంబీ దాటకూడదు) అప్​లోడ్​ చేయాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తారు. దరఖాస్తుకు చివరితేది జూలై 4. వివరాలకు www.pjtsau.edu.in  వెబ్​సైట్​ చూడవచ్చు.

సెలెక్షన్​ ప్రాసెస్​

పదో తరగతిలో సాధించిన గ్రేడ్‍ పాయింట్​ యావరేజ్‍ ఆధారంగా మెరిట్​ లిస్ట్​ తయారు చేసి కౌన్సెలింగ్‍ నిర్వహిస్తారు. ఏ ఇద్దరికైనా ఒకే గ్రేడ్స్​ వచ్చినప్పుడు వరుసగా సైన్స్, గణితం, ఇంగ్లిష్‍, తెలుగు, సోషల్‍, హిందీ, చివరగా పుట్టినతేదిని పరిగణనలోకి తీసుకొని అడ్మిషన్​ కల్పిస్తారు.

 

డాక్యుమెంట్స్

ఎస్సెస్సీ / తత్సమాన అర్హత సర్టిఫికెట్

4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్

ట్రాన్స్ ఫర్‍ సర్టిఫికెట్‍ (టీసీ)

నాన్‍ మున్సిపల్‍ ఏరియా స్టడీ సర్టిఫికెట్‍(ఫాం–1)

క్యాస్ట్​ సర్టిఫికెట్ (బీసీ/ఎస్సీ/ఎస్టీ)

ఫిజికల్లీ చాలెంజ్డ్​సర్టిఫికెట్‍(పీహెచ్‍ కేటగిరీ)

ఎక్స్ ఆర్మీ/ డిఫెన్స్ సర్టిఫికెట్స్

ఎన్‍సీసీ సర్టిఫికెట్​

స్పోర్ట్స్, గేమ్స్ సర్టిఫికెట్స్

 

సీట్లు ఎన్ని?

యూనివర్సిటీ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 13 ప్రభుత్వ పాలిటెక్నిక్‍లు, 12 ప్రైవేటు కాలేజీలున్నాయి. ప్రభుత్వ పరిధిలోని వాటిలో 11 కాలేజీల్లో అగ్రికల్చర్​,  ఒక కాలేజీలో సీడ్​ టెక్నాలజీ, ఒక కాలేజీలో అగ్రికల్చర్​ ఇంజినీరింగ్​ కోర్సు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు పాలిటెక్నిక్​లలో 7 కాలేజీలు, అగ్రికల్చర్​, ఒక కాలేజీ సీడ్​ టెక్నాలజీ, ఒక కాలేజీ ఆర్గానిక్​ ఫార్మింగ్​, మూడు కాలేజీలు అగ్రికల్చర్​ ఇంజినీరింగ్ కోర్సు ఆఫర్​ చేస్తున్నాయి.

కోర్సు వర్శిటీ పరిధి అనుబంధ కాలేజీలు
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్​ 200 420
డిప్లొమా ఇన్ సీడ్​ టెక్నాలజీ 20 60
డిప్లొమా ఇన్  ఆర్గానిక్​ అగ్రికల్చర్​ 0 60
డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్‍ ఇంజినీరింగ్ 20 90
మొత్తం 240 630