- పైలట్ ప్రాజెక్ట్‌గా నియోజకవర్గాన్ని ఎంపిక చేసిన ప్రభుత్వం
- 7,600 మంది కోసం రూ.93.76 కోట్లు విడుదల
- నల్గొండ, యాదాద్రి జిల్లాల పేరుతో జీవో విడుదల
నల్గొండ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల స్కీం రూల్స్‌ను ఉన్నట్టుండి మార్చేసింది. దళితబంధు తరహాలో లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి, తర్వాత యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని నిర్ణయించింది. కొత్త గైడ్‌లైన్స్‌ను రాష్ట్రం మొత్తం ఒకేసారి అమలు చేయకుండా పైలట్ ప్రాజెక్టు కింద మునుగోడు నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. ఈ మేరకు అక్టోబర్ 1న ప్రభుత్వం ఆగమేఘాలపై ఆర్డర్స్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులు సోమవారం బయటకు వచ్చాయి. దీంట్లో నేరుగా మునుగోడు పేరు ప్రస్తావించకుండా నల్గొండ, యాదాద్రి జిల్లాల పేర్లతో ప్రభుత్వం సరిపెట్టింది. నల్గొండ జిల్లాలో 5,600 యూనిట్లు, యాదాద్రి జిల్లాలో 2 వేల యూనిట్లు కలిపి మొత్తం 7,600 యూనిట్లకుగాను రూ.93.76 కోట్లు జిల్లా కలెక్టర్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ 7.600 మంది లబ్ధిదారులు మునుగోడు నియోజకవర్గానికి చెందినవాళ్లే. గతేడాది నాగార్జునసాగర్, హుజూరాబాద్ ఎన్నికలప్పుడు కూడా ఇదేరకంగా ఆగమేఘాల మీద గొర్రెల యూనిట్లను పంపిణీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ఆపేసింది. మళ్లీ ఏడాది తర్వాత దళిత బంధు తరహాలో నగదు బదిలీ స్కీంను మునుగోడు ఉప ఎన్నికలో తెరపైకి తెచ్చింది.
పైలెట్ ప్రాజెక్టుగా మునుగోడు..
గొర్రెల స్కీం కింద నగదు బదిలీ కోసం మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కలిపి మొత్తం 7,600 మంది లబ్ధిదారులను అధికారులు ఫైనల్ చేశారు. ఒక్కో లబ్ధిదారు అకౌంట్లలో రూ.1. 75 లక్షలు బదిలీ అయ్యేలా కలెక్టర్ అకౌంట్లలోకి ఫండ్స్ రిలీజ్ చేశారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం లబ్ధిదారులు 12,661 మందికాగా.. మొదటి విడతలో 5,061 మందికి గొర్రెలు పంపిణీ చేశారు. ఇప్పుడు రెండో విడతలో బ్యాలెన్స్ 7,600 మందికి గొర్రెలు ఇవ్వాలని నిర్ణయించారు. 2017లో స్కీం ప్రారంభంకాగా రాష్ట్ర వ్యాప్తంగా 7.61 లక్షల మంది లబ్ధిదా రులను గుర్తించి మొదటి విడతలో 3.88 లక్షల మందికి గొర్రెలు పంపి ణీ చేశారు. రెండో విడతలో 3.50 లక్షల మంది గొర్రెలు కోసం డీడీలు కట్టి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కొత్త గైడ్‌లైన్స్ రావడంతో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల అందరికీ నగదు బదిలీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
ఎస్డీఎఫ్ ఆర్డర్స్ కూడా వచ్చినయ్..
మునుగోడు నియోజకవర్గంలో గతం లో హామీ ఇచ్చిన ఎస్డీఎఫ్ ఫండ్స్ శాంక్షన్ ఆర్డర్స్ నాలుగు రోజుల కిందట్నే జిల్లా అధికారులకు అందాయి. 157 జీపీలకు రూ. 20 లక్షల చొప్పున, ఆరు మండలాలకు రూ.30 లక్షల చొప్పున ప్రభుత్వం శాంక్షన్ చేసింది. జిల్లా ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ ఆర్డర్స్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు వెళ్లాయి. కానీ సోమవారం నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇటు గొర్రెలు, అటు ఎస్ డీఎఫ్ ఫండ్స్ పై అధికారుల్లో సందిగ్ధత నెలకొంది. ఎన్నికల కమిషన్ సలహా తీసుకున్నాకే వీటిని అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కాబట్టి అభ్యంతరం ఉండకపోవచ్చని, ఏదైనా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే అమలు చేస్తామని పేర్కొన్నారు.