- లిక్కర్ కల్తీ చేస్తున్నరు!
- పెబ్బేరు మండల కేంద్రంగా అక్రమ దందా
- వైన్స్‌ల నుంచి నేరుగా బెల్టుషాపులకు సరఫరా
- ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో గుట్టు రట్టు
వనపర్తి,పెబ్బేరు, వెలుగు : ఓ వైపు ప్రభుత్వం విచ్చలవిడిగా లిక్కర్ ధరలను పెంచుతుంటే... మరోవైపు వైన్స్ నిర్వాహకులు దాన్ని కల్తీ చేస్తూ వినియోగదారుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. గ్రామాల్లో యథేచ్ఛగా బెల్టుషాపులు కొనసాగుతుండడంతో అక్కడికి సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు కేంద్రంగా సాగుతున్న ఈ దందా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో వెలుగు చూసింది. కల్తీ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్‌ఫోర్స్ మెంట్ సీఐ చిరంజీవి ఆధ్వర్యంలోని టీమ్ పెబ్బేరులోని రఘు వైన్స్‌లో తనిఖీలు చేసింది. సీసాల మూతలు ఓపెన్ చేసి లిక్కర్‌ను తీసి, నీళ్లు, నకిలీ లిక్కర్ పోస్తున్నట్లు గుర్తించారు. ఓసీ 750 ఎంఎల్– 33, ఐబీ విస్కీ 375 ఎంఎల్ – 78, ఐబి 180 ఎంఎల్ – 61 శాంపిల్‌గా తీసుకెళ్లి పరీక్షించారు. కల్తీ ఉన్నట్లు నిర్దారణ కావడంతో వైన్ షాప్ నిర్వాహకుడు మేకల ఎల్లస్వామి, శివకుమార్‌లపై కేసు నమోదు చేసినట్లు మంగళవారం కొత్తకోట ఎక్సైజ్ సీఐ ఓంకార్ తెలిపారు. మొత్తంసీసాలు, సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకోని కొత్తకోట ఎక్సైజ్ స్టేషన్ లో డిపాజిట్ చేశామని చెప్పారు.
కల్తీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ గా పెబ్బేరు
44 జాతీయ రహదారి పై గల పెబ్బేరుకు కల్తీ మద్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. పెబ్బేరు ఉమ్మడి మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయతీలు ఉండగా.. దాదాపు 110 దాకా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. పెబ్బేరు మున్సిపాలిటీతో పాటు గ్రామాల పరిధిలోని బెల్డుషాపులకు కల్తీలిక్కర్‌ను తరలిస్తున్నారు. ఈ గ్రామాల్లో ప్రతి యేటా పెద్ద దేవర పండుగలు జరుపుతుంటారు. ఈ సమయాల్లో బెల్టు షాపుల కోసం వేలం పాట నిర్వహిస్తున్నారంటే ఏ రేంజ్‌లో గిరాకీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పండుగలను వైన్స్ నిర్వాహకులు, లీడర్లు, ఎక్సైజ్ ఆఫీసర్లు క్యాష్ చేసుకుంటున్నట్లు తెలిసింది. అంతేకాదు ఇక్కడి ప్రజలు ఏపీలోని కర్నూల్‌తో ఎక్కువ సంబంధాలు ఉంటాయి. అక్కడ మద్యం రేట్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి నుంచి అక్కడికి తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఎక్సైజ్ ఆఫీసర్లకు మామూళ్లు!
కల్తీ మద్యం దందా జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతినెలా మామూళ్లు అందుతుండడంతో సైలెంట్‌గా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని రఘు వైన్ షాప్‌లో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం రాత్రి తనిఖీ చేసినా.. విషయాన్ని బయటిని రానియ్యలేదు. మంగళవారం ఉదయం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా కావడంతో సాయంత్రం మీడియాకు వివరాలు ఇచ్చారు.