న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మొదటి పదేళ్ల పాలనలో ఇండియా డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు 182 శాతం పెరిగి రూ.19.60 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ‘టైమ్ సిరీస్ డేటా’ రిపోర్ట్ ప్రకారం, కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు రెండింతలకు పైగా పెరిగి 2023–24 నాటికి రూ.9.11 లక్షలకు చేరుకున్నాయి. పర్సనల్ ట్యాక్స్ వసూళ్లు సుమారు నాలుగు రెట్లు పెరిగి రూ.10.45 లక్షల కోట్లను టచ్ చేశాయి. మోదీ గవర్నమెంట్‌లోని మొదటి ఆర్థిక సంవత్సరం 2014–15 లో రూ.6.96 లక్షల కోట్లు డైరెక్ట్ ట్యాక్స్ కింద వసూళ్లయ్యాయి.
ఇందులో రూ.4.29 లక్షల కోట్లు కార్పొరేట్ ట్యాక్స్ కింద, రూ.2.66 లక్షల కోట్లు పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ కింద వచ్చాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (రివైజ్డ్‌వి కూడా కలిపి) 2014–15 లో 4.04 కోట్లు ఉంటే 2023–24 నాటికి 8.61 కోట్లకు పెరిగాయి. డైరెక్ట్ ట్యాక్స్ – జీడీపీ రేషియో 5.55 శాతం నుంచి 6.64 శాతానికి చేరుకుంది. మోదీ మొదటి పదేళ్ల పాలనలో ట్యాక్స్ కట్టేటోళ్లు 5.70 కోట్ల నుంచి 10.41 కోట్లకు పెరిగారు.