అతిశయోక్తులు, పగలు ప్రతీకారాలు వంటివి లేకుండా నిజానికి దగ్గరగా సరికొత్త లోకంలో తీసుకెళ్ళి అందరినీ మెప్పించేలా గంధర్వ చిత్రం తీశానని దర్శకుడు అప్సర్ అన్నారు. సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం `గంధర్వ`. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్ పై యఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుబాని నిర్మించారు. సెన్సార్ పూర్తయి జూలై1న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా గంధర్వ చిత్ర దర్శకుడు అప్సర్ మంగళవారం మీడియా సమావేశంలో పలు విషయాలను వెల్లడించాడు.
అసలు గంధర్వ ఆలోచన ఎలా వచ్చింది?
నేను డిఫెన్స్‌లో సర్వీస్ చేసి తిరిగి వచ్చాక దర్శకత్వం చేయాలనే పట్టుదలతో పూనె ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందాను. ఆ తర్వాత దర్శకుడిగా కొత్తదనంగా ఆలోచించాలని చాలా ప్రయత్నాలు చేశాను. రకరకాల కథలు అనుకున్నాను. కానీ ఏదీ సరికొత్తగా అనిపించలేదు. ఆ టైంలో ఇజ్రాయిల్‌లో జరిగిన ఓ యదార్థ సంఘటన గురించి తెలుసుకున్నాను. దానినుంచి యాంటీ ఏజ్(వయస్సు ఎక్కువైనా యంగ్‌గా వుండేలా) పై కథ రాయాలనిపించింది. అలా యాంటీ ఏజ్ వున్న వ్యక్తికి తన కుటుంబంతో లింక్ పెడితే ఎలా వుంటుందనే ఆలోచనలోంచి గంధర్వ కథ పుట్టింది. నిజానికి దగ్గరగా వుండాలని దీనిపై రెండేళ్ళు పరిశోధన చేశాను. క్లయిమాక్స్ బాగా వచ్చేలా జాగ్రత్త తీసుకున్నాను. 90 శాతం నిజానికి దగ్గరగా వుంటుంది.
మిలట్రీ నేపథ్యం ఎంచుకోవడానికి కారణం?
1971లో వార్ జరుగుతుంది. దానికోసం ఓ ప్రాంతానికి అతను వెళ్ళాలి. మామూలు వ్యక్తులు వెళ్ళే ఛాన్స్‌లేదు. అందుకే మిలట్రీ బ్యాక్‌గ్రౌండ్ వుంటేనే అక్కడికి వెళ్ళి అక్కడ జరిగే అంతరిక్ష పరిశోధనకు లింక్ పెట్టి తీశాం. అయితే ఆర్మీ నేపథ్యం అనేది కేవలం ఐదు నిముషాలే వుంటుంది. ఇది యూత్‌కు బాగా నచ్చే అంశం. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ట్రాక్స్, సైన్స్ గురించి ఆలోచించేవారు, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు మెచ్చేవారికి ఎగబడి చూస్తారు.
ఈ పాత్రకు సందీప్‌నే ఎంచుకోవడానికి కారణం?
ఈ కథను ముగ్గురు హీరోలకు చెప్పాను. కానీ కొత్తవాడిని కావడంతో అవకాశం ఇవ్వలేదు. ఇద్దరయితే కథ మాకు ఇచ్చేయండి. వేరే దర్శకుడితో తీస్తామన్నారు. కానీ నేనే చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఆ సమయంలో సంగీత దర్శకుడు షకీల్ ద్వారా సందీప్ మాధవ్ పరిచయం అయ్యారు. తను వంగవీటి, జార్జిరెడ్డి చిత్రాల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలవారికి బాగా కనెక్ట్ అయ్యాడు. అతనికి పెద్ద ఇమేజ్ లేదు. ఇలాంటి వాడే నా గంధర్వలో కెప్టెన్ అవినాష్ పాత్రకు సూటవుతాడనిపించి తీసుకున్నాను.
1971-2021 అని టైటిల్‌లోపెట్టడానికి కారణం?
మనకు బంగ్లాదేశ్ యుద్ధం 1971లో జరిగింది. ఆ వార్‌లో పాల్గొనడానికి వెళ్ళిన వ్యక్తి జీవితంలో జరిగిన ఒక సంఘటన వలన అతను తిరిగి ఇంటికి రావడానికి యాభై ఏళ్లు పట్టింది. ఇంటికి వచ్చేసనికి 2021 అవుతుంది. అప్పటికే భార్యకు 80 ఏళ్లు, కొడుక్కి 50 వచ్చేస్తాయి. తను మాత్రం యువకుడిగానే వుంటాడు. ఇందులో హాలీవుడ్‌కు సంబంధించిన సర్‌ప్రైజ్ కూడా వుంటుంది. దాని కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే కరెక్టే కదా అని నమ్ముతారు కూడా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ లాంటి సీన్ ఒకటి ఇందులో ఉంది ... పండగ చేస్కుంటారు.
ఈ సినిమా నిడివి ఎంత ?
2గంటల 10 నిముషాలు.
ఇంకా ఆసక్తికర అంశాలు ఏమైనా వున్నాయా?
సందీప్ ప్యాన్‌కు నచ్చేలా చేయడంతోపాటు మాస్ మసాలా, దేశభక్తి అంశాలు కూడా ఇందులో వున్నాయి. ఇప్పుడు మేజర్, షేర్‌షా వంటి దేశభక్తి చిత్రాలు బాగా చూస్తున్నారు. డిఫెన్స్‌లోని వార్ సీక్వెన్స్ కోసం లఢాక్‌లో షూట్ చేశాం. అయితే తనెందుకు ఇలా మారిపోయాడని తనకే తెలీదు. అలాంటి వ్యక్తి 2021లోకి వచ్చి సమాజాన్ని ఎలా నమ్మించాలని ప్రయత్నించాడు? అనేది చాలా సర్‌ప్రైజ్ ఎలిమెంట్. త్వరగా క్లైమాక్స్ చూడాలనే ఆతృత కూడా ప్రేక్షకుడికి కల్గిస్తుంది.
సైన్స్‌ను ఎలా ఉపయోగించారు?
మా గంధర్వలో వాడిన అంశం మన అందరికి తెలిసిందే, దాన్ని పక్కగా చెప్పే ప్రయత్నంలో కొన్ని ఆధారాలు సేకరించాం, సినిమా చూసినప్పుడు అవి అందర్నీ ఆశ్చర్య పరుస్తాయి.
ఇతర నటీనటులు ఎవరెవరు?
గాయత్రి ఆర్. సురేష్ నటించింది. తను బలమైన పాత్ర పోషించింది. ఈ సినిమా విడుదలయ్యాక ఆమెకే మంచి పేరు వస్తుంది. ఇంకా శీతల్ భట్, సాయికుమార్, సురేష్, బాబూమోహన్, పోసాని కృష్ణమురళి, సమ్మెట గాంధీ, దర్శకుడు వీరశంకర్. ఆటో రాంప్రసాద్, రోహిణి, మధు నంబియార్ వీరంతా కథను నడిపించే పాత్రలే.
కథ రాయడం ఓ భాగమైతే దాన్ని తీసి మెప్పించడం మరో భాగం సినిమా అయ్యాక మీరనుకున్నది ఫుల్‌ఫిల్ అయిందనుకున్నారా?
గంధర్వ కథ గత ఆరేళ్లుగా రాసి పెట్టుకున్న కథే , కాకా పోతే క్లైమాక్స్ దొరకలేదు . దేవుడి వల్ల జరిగిందనో , లేక ఇంకేదో ఒక కారణం చెప్పి కథను పూర్తీ చెయ్యలేక పోయాను . గంధర్వ కథకు అవసరమైన క్లైమాక్స్ దొరికిన తర్వాతే షూట్ మొదలు పెట్టాను . అదృష్ట వశాత్తు అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ దొరకడం వల్ల అనుకున్నట్టే ప్రాజెక్ట్ పూర్తయ్యింది . ముఖ్యంగా మా DOP జవహర్ రెడ్డి గారు , దర్శక నటులు వీర శంకర్ గారు , editor బసవ పైడి రెడ్డి గారు అవసరం మేరకు మంచి సూచనలు ఇచ్చారు.
ఈ కథను ఇంతలా ముందుకు తీసుకెళ్ళడానికి మీకున్న బలం ఏమిటి?
నేను దర్శకత్వం చేయాలనుకున్నప్పుడు రివెంజ్, అతిశయోక్తులు చెబితే ప్రేక్షకుడు చూస్తానికి రెడీగా లేరు అనిపించింది. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా చాలా క్విక్‌గా కొత్తగా అనిపించాలి. అలాంటి కొత్తదనం, నిజానికి దగ్గరగా వుండేలా చెప్పాలనుకోవడం అనే బలమే నన్ను ముందుకు నడిపింది.
కొత్త సినిమాలు?
రెండు కథలు రెడీగా వున్నాయి. గంధర్వ రిలీజ్ అయ్యాక పెద్ద నిర్మాణ సంస్థలో ఒక సినిమా త్వరలో ప్రారంభమవుతుంది. అని అప్సర్ ముగించారు.