లస్ట్ కోసం కాదు.. లవ్ కోసం : అవనీంద్ర

లస్ట్ కోసం కాదు.. లవ్ కోసం : అవనీంద్ర

నవదీప్ హీరోగా నటించిన చిత్రం ‘లవ్ మౌళి’. రాజమౌళి శిష్యుడు అవనీంద్ర దర్శకత్వం వహించాడు.  నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంస్థలతో కలిసి నవదీప్‌‌కు చెందిన సి స్పేస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. జూన్ 7న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు అవనీంద్ర మాట్లాడుతూ ‘‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి అసోసియేట్‌‌ రైటర్‌‌‌‌గా వర్క్ చేస్తున్న సమయంలో ఈ స్టోరీ లైన్ అనుకున్నాను. హీరోగా ఎవరినో ఊహించుకుని ఈ కథ రాయలేదు. కథ రాశాక నవదీప్‌‌కు వెళ్లి వినిపించా. కథ వినగానే ఎగిరి గంతేశాడు. ఇలాంటి కథ కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా అన్నాడు. 

ఓ జంట మధ్య రిలేషన్‌‌ ఒకటి, రెండేళ్ల తర్వాత ఎందుకు బ్రేక్ అవుతోంది అన్న ఆలోచన నుంచి వచ్చిన కథ ఇది.  ఇందులో హీరో పాత్రకు ఎటువంటి సెన్సిబిలిటీస్ ఉండవు. లిప్ లాక్స్, బోల్డ్ డైలాగ్స్ బోలెడన్ని ఉంటాయి. అవన్నీ కావాలని పెట్టినవి కాదు. కథకు అవసరమైనవే.  ప్రేమంటే నాకు నచ్చినట్టు ఉండమనడం కాదు.. నాకు నచ్చకపోయినా.. నిన్ను నీలా ఉండనీయడం ప్రేమ. అదే ఇందులో చెప్పదలచుకున్నా. ఇంకా చెప్పాలంటే లస్ట్ కోసం చేసిన సినిమా కాదు.. లవ్ కోసం చేసిన సినిమా ఇది. కరోనా తర్వాత జనాలు ప్రపంచ సినిమాను చూస్తున్నారు. టాలీవుడ్ ఇంకా ఐటమ్ సాంగ్స్ దగ్గరే ఉంది. కానీ ఈ కథకి అన్ని రకాల ఎలిమెంట్స్ చాలా బాగా కుదిరాయి’ అని చెప్పాడు.