డాకు మహారాజ్ గుర్తుండిపోతుంది

‘డాకు మహారాజ్’  సినిమాలో  విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు అని చెప్పాడు  దర్శకుడు బాబీ కొల్లి. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఆదివారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బాబీ చెప్పిన విశేషాలు.

‘‘బాలకృష్ణ గారి ఇమేజ్‌‌‌‌ని, ప్రేక్షకుల్లో ఆయన సినిమాపై ఉండే అంచనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా రూపొందించాం. ఆయన గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా చూపించడానికి ప్రయత్నించాం. నరసింహానాయుడు, సమరసింహారెడ్డి తర్వాత సింహా ఎలా అయితే గుర్తుండే సినిమా అయిందో.. ‘డాకు మహారాజ్’  కూడా అలాంటి పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది. బాలకృష్ణ గారి నుంచి ఎవరైనా క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. దర్శకుడికి ఎంతో గౌరవం ఇస్తారు. మనం ఎంత నిజాయితీగా ఉంటే బాలకృష్ణ గారు అంత గౌరవిస్తారు. అభిమానుల కోసం డూప్ లేకుండా నటించడానికి ఇష్టపడతారు. మొండి గుర్రాన్ని  సైతం కంట్రోల్ చేస్తూ, స్వయంగా స్వారీ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్  మంచి ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. ఇద్దరూ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే  రెగ్యులర్ విలన్ పాత్రలా కాకుండా బాబీ డియోల్ గారి పాత్ర కొత్తగా ఉంటుంది. నిర్మాత నాగవంశీ గారు కూడా బాలయ్య గారికి అభిమాని. ఆ అభిమానంతోనే తమ బ్యానర్‌‌‌‌‌‌‌‌లో వచ్చే సినిమా వైవిధ్యంగా ఉండాలి అనుకున్నారు. అలాగే ఒక దర్శకుడిగా నాకెంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఇద్దరం కలిసి ఈ సినిమాలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడేలా చేయాలి అనుకున్నాం. ‘జైలర్‌‌‌‌‌‌‌‌’కు వర్క్ చేసిన  డీఓపీ విజయ్ కన్నన్‌‌‌‌ ఈ కథను ఓన్ చేసుకున్నారు.  అందుకే విజువల్స్ అంత అద్భుతంగా వచ్చాయి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు వంటి సీనియర్ హీరోలతో కలిసి పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా’’.