నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మేనల్లుడు శ్రీకాంత్ కవుటూరి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మేకప్ మ్యాన్’. దివాకర్ యడ్ల దర్శకత్వంలో కుమార్ మెట్టుపల్లి నిర్మిస్తున్నారు. పోలూరు ఘటిక చలం డైలాగ్స్, ఎం ఎం శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దర్శకులు రవి కుమార్ చౌదరి, భరత్ పారేపల్లి, నిర్మాత లయన్ సాయి వెంకట్ అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హీరో శ్రీకాంత్ కవుటూరి మాట్లాడుతూ ‘ఇలాంటి మంచి కాన్సెప్ట్‌తో హీరోగా పరిచయం అవడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘చిత్ర పరిశ్రమలో మేకప్ మ్యాన్ ప్రాముఖ్యత చాలా కీలకంగా ఉంటుంది. వాళ్ల లైఫ్ స్టైల్, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’ అని చెప్పాడు. ‘మేకప్ మ్యాన్‌గా వర్క్ చేసిన నేను ఇలాంటి మంచి కథతో నిర్మాతనవడం హ్యాపీ’ అని నిర్మాత కుమార్ అన్నారు.