దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) సినిమాలు అనగానే.. భారీ సెట్స్, స్టార్ కాస్ట్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కలర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ ఈసారి ఆయన రూటు మార్చారు. వాస్తవిక అంశాలకు దగ్గరగా అందరూ కొత్తవారితో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామా తెరకెక్కిస్తున్నారు.
విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా భూమిక ముఖ్య పాత్రను పోషిస్తోంది. గుణశేఖర్ కూతురు నీలిమ గుణ నిర్మిస్తున్నారు. సోమవారం వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు.నిర్మాతలు దిల్ రాజు, దామోదర ప్రసాద్ దీన్ని లాంచ్ చేశారు.
అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ ‘గుణ శేఖర్ ఎన్నో జయాపజయాలు చూశారు. ఫెయిల్యూర్స్ తరువాత సక్సెస్ ఇచ్చే కిక్కు వేరేలా ఉంటుంది. నైట్ లైఫ్, డ్రగ్స్ ఇలా ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా యుఫోరియా గ్లింప్స్ ఉంది. కొత్త వాళ్లతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
Also Read : కీలక అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
గుణ శేఖర్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో తొంభై శాతం కొత్తవాళ్లే కనిపిస్తారు. సినిమాటిక్‌గా కాకుండా అందరూ రియలిస్టిక్‌గా నటించారు. నేటి సమాజంలో జరుగుతున్న ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నా. ఇప్పటివరకు అరవై శాతం షూట్ పూర్తయింది’ అని చెప్పారు. యూత్, పేరెంట్స్ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని నిర్మాత నీలిమ గుణ చెప్పారు. ఈ చిత్రంతో తమకు మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నామని నటీనటులు అన్నారు.
యుఫోరియా మూవీ గ్లింప్స్:
అక్టోబర్ 7న యుఫోరియా మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తోంది. గుణ శేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సామాజిక అంశంతో ప్రతి అంశం పక్కాగా ప్లాన్ చేసి, ఈ సినిమా తెరకెక్కించినట్లు గ్లింప్స్ సాగింది. డ్రగ్స్ కి బానిసై లోకం మరిచేలా మత్తులో ఉన్న యువతను తట్టిలేపేలా.. అసలు లైఫ్ అంటే ఏంటో ఆలోచింపజేసేలా ఉండటంతో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.
డ్రగ్స్ కల్చర్, లేట్ నైట్ పార్టీలు, అమ్మాయిల మీద అఘాయిత్యాలు అనే కాన్సెప్టులతో ఈ యుఫోరియాను చూపించాడు. అయితే ఈ మూవీ గురించి చెబుతూ గుణ శేఖర్ టైటిల్ ఇలా పెట్టేందుకు గల కారణాన్ని కూడా మీడియాతో చెప్పుకొచ్చాడు. కాగా గుణేశేఖర్ తన గత సినిమాలన్నిటికీ అచ్చమైన తెలుగులోనే టైటిల్స్ ఉండటంతో.. యుఫోరియాఅని పెట్టడానికి గల కారణం ఏంటనే ప్రశ్న ఎదురవ్వగా.. తనదైన శైలిలో స్పందించాడు. ఇంత వరకు తాను దాదాపు తెలుగు టైటిల్స్‌నే పెట్టానని, కానీ ఇప్పుడు ఇలాంటి ఓ డిఫరెంట్ టైటిల్‌ను పెట్టానని అన్నాడు. అందుకు కారణం లేకపోలేదని.. తెలుగులో టైటిల్ పెడితే ఎవ్వరికీ అర్థం కాని స్థితిలో ప్రస్తుత జనరేషన్ ఉందని అభిప్రాయపడ్డారు.
మొదట ఈ మూవీకి యుఫోరియాకు బదులు 'ఉద్వేగం' అనే టైటిల్ అనుకున్నారట డైరెక్టర్ గుణశేఖర్. ఇక ఈ టైటిల్ ఎలా ఉందని ఇంట్లో అడిగితే.. మా ఫ్యామిలీలోనే వద్దు బాబోయ్ అని అన్నారని అన్నారు. దాంతో యుఫోరియా అని టైటిల్ చెబితే.. బాగుందని అందరూ అన్నారట.. ఉద్వేగం అంటే ఏంటో కూడా తెలియని స్థితిలో దాని కోసం అర్థాలు వెతుక్కునే స్టేజ్‌లో ఉన్నామని గుణ శేఖర్ చెప్పుకొచ్చాడు.
తెలుగు పదాలకు అర్థాలు డిక్షనరీలో తెలుసుకునే స్థాయికి వచ్చేశామని చెప్పడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. వాస్తవానికి ఇపుడు ఇండస్ట్రీలో తెలుగులో పెట్టె టైటిల్స్ పూర్తిగా మారిపోయాయి అనే వాదన కూడా ఉంది.