నవ్వుల టానిక్‌తో ఒత్తిడిని తరిమేశారు

నవ్వుల టానిక్‌తో ఒత్తిడిని తరిమేశారు

కోటి రోగాలకైనా ఒకే మందుతో వైద్యం చేయగలిగేవాళ్లని ఏమంటారు? జంధ్యాల అంటారు. అవును. ఆయన అదే చేశారు. నవ్వుల టానిక్‌తో ఒత్తిడిని తరిమేశారు. బాధల్ని మరిపించారు. భారమైన హృదయాలని సైతం దూదిపింజెల్ని చేసి ఎగురవేశారు. పరుగులు పెట్టింది చాలు, కాసేపు ఆగి నవ్వి పొమ్మన్నారు. ఆ కామెడీ కడలిలో మునిగి, తేలి ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. కానీ ఒకరోజు ఆ నవ్వుల డాక్టర్‌‌ కనుమరుగైపోయాడు. ఇక సెలవంటూ శోకాన ముంచేసి వెళ్లాడు. దురదృష్టకరమైన ఆ రోజు.. ఈ రోజే. తన రచనతో, డైరెక్షన్‌తో తెలుగు ప్రేక్షకుల ముఖాల నిండా నవ్వుల్ని పులిమిన జంధ్యాల వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనపై స్పెషల్ స్టోరీ. 

ఖరీదైన బహుమతి ఇచ్చేవాడికంటే.. పెదవులపై చిన్న చిరునవ్వు పుట్టించేవాడే గొప్పవాడంటారు. అలా చూసుకుంటే.. తెలుగు ప్రజలందరినీ పడీ పడీ నవ్వేలా చేసిన జంధ్యాల అందరి కంటే మిన్న. 1951లో సంక్రాంతి పండుగ నాడు నరసాపురంలో పుట్టారు జంధ్యాల. పూర్తి పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. బీకామ్ వరకు చదువుకున్నారు. కానీ మనసంతా నాటకాల మీదే. చిన్నప్పట్నుంచీ ఎందుకో నాటకాలంటే అమితమైన ఆసక్తి. చూడటమే కాదు.. రాయడం కూడా మొదలుపెట్టారు. ఆయన రాసినవాటిలో ఏక్ దిన్‌కా సుల్తాన్, గుండెలు మార్చబడును వంటి నాటకాలు చాలా విజయం సాధించాయి. ఎన్నో నాటకాలు రాశారు. ఎన్నెన్నో బహుమతులు అందుకున్నారు. 

పదునైన కలం

సినీ ఇండస్ట్రీలో రచయితగా చాలా గొప్ప ముద్ర వేశారు జంధ్యాల. ‘దేవుడు చేసిన బొమ్మలు’ సినిమాతో రైటర్‌‌గా ఆయన ప్రయాణం మొదలయ్యింది. శంకరాభరణం, సాగరసంగమం, సీతాకోక చిలుక, సప్తపది, అడవి రాముడు, వేటగాడు లాంటి ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలకి మాటలు రాశారు. ఆయన కలానికి వేగం ఎక్కువ. పది రోజుల్లో సినిమాకి డైలాగ్స్ రాసేసేవారు. 1983లో అయితే ఏకంగా 80 సినిమాలకు మాటలు రాశారు. తెలుగు సినిమా చరిత్రలో ఇదో పెద్ద రికార్డ్. సాధారణంగా రచయితలు కొన్ని జానర్స్ లో  నైపుణ్యం ప్రదర్శిస్తారు. కానీ జంధ్యాల తీరే వేరు. కళాత్మక చిత్రమైనా.. హాస్యరస భరితమైనా.. వినోదమైనా.. విషాదమైనా.. ఏదైనా రాయగల నేర్పరి. ఆయన రాసే ప్రతి మాట వినసొంపుగా ఉండేది. వినీ వినగానే మనసులోకి చొరబడేది. ఎన్నేళ్లయినా దాన్ని మర్చిపోవడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. శంకరాభరణం, సప్తపది లాంటి సినిమాలు చూస్తే.. సింపుల్‌ పదాల్లో ఎంతో లోతైన భావం కనిపిస్తుంది. బరువైన విషయాన్ని కూడా తేలికగా అర్థమయ్యేలా చెప్పడం ఆయన స్టైల్. 

దర్శకధీరుడు

ఓ మంచి రచయిత, మంచి దర్శకుడు కూడా కాగలడు అనడానికి పర్‌‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ జంధ్యాల. ‘ముద్దమందారం’ సినిమాతో మెగాఫోన్ పట్టిన ఆయన.. ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు తీశారు. నాలుగు స్తంభాలాట, రెండు జెళ్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, పడమటి సంధ్యారాగం లాంటి ఎన్నో సూపర్బ్‌ ఫిల్మ్స్ ఆయన నుంచి వచ్చాయి. రెండు రెళ్లు ఆరు, అహ నా పెళ్లంట, చూపులు కలసిన శుభవేళ లాంటి కామెడీ ఎంటర్‌‌టైనర్స్ ను  ఎంత బాగా తీసేవారో.. పుత్తడి బొమ్మ, అమరజీవి, ఆనందభైరవి లాంటి సీరియస్‌ ఎమోషనల్ సబ్జెక్ట్స్ లను  అంతే గొప్పగా రూపొందించేవారు. తనదైన టిపికల్ ఫిల్మ్‌ మేకింగ్ స్టైల్ ఉండేది జంధ్యాలకి. సినిమా నిండా జనం ఉంటారు. ప్రతి ఆర్టిస్టుకీ సీన్స్ సమానంగా పంచారా అన్నట్టుగా అనిపించేది. సినిమా అంటే ఒకట్రెండు క్యారెక్టరయిజేషన్లు, ఒకరిద్దరి డైలాగులు భలే ఉన్నాయి అనిపిస్తుంది. కానీ జంధ్యాల సినిమాలో ప్రతి ఒక్కరి పాత్రకీ ప్రత్యేక చిత్రణ ఉండేది. అందరి డైలాగ్స్ గుర్తుండిపోయేవి. వాళ్ల మేనరిజమ్స్, గెటప్స్ ఏవీ మనం మర్చిపోలేం. ఇదంతా జంధ్యాల దర్శకత్వం ప్రతిభకి తార్కాణమే తప్ప మరొకటి కాదు. 

నవ్వుల పాఠశాల

కామెడీని ఎలా రాయాలో, స్క్రీన్‌పై ఎలా ప్రెజెంట్ చేయాలో జంధ్యాలకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఆయన రాసే డైలాగ్స్ చాలా వెరైటీగా ఉండేవి. ఒళ్లంతా మట్టి పూసి హింసిస్తున్న ఇంటి ఓనర్‌‌తో.. ‘ఈ చెమ్మంతా ఇగిరేలోపు మన కళ్లు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభో’ అంటాడు ఓ సినిమాలో బ్రహ్మనందం. అంతేనా.. ‘ఇలా మనల్ని జూవాళ్లు చూస్తే కోతులొచ్చాయని పట్టుకుపోతారు. జనం చూస్తే ఇతర గ్రహాల నుంచి వచ్చామనుకుని రాళ్లిచ్చుక్కొడతారు’ అని బతిమాలతాడు. అక్కడ ఈ డైలాగ్ ఒకెత్తయితే.. దాన్ని బ్రహ్మానందం చెప్పే విధానం, అప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, దానికి ఓనర్ సుత్తి వీరభద్రరావు రియాక్షన్స్ అల్టిమేట్. అలాగే జంధ్యాల ప్రాస డైలాగ్స్ కూడా ఫేమస్. ‘రాజా ప్రియురాలు రోజా మేజా బల్లమీదికెక్కి కాజాలు తింటూ నీ వీపు మీద బాజాలు బాదుతుంటే నువ్వేం చేస్తున్నావురా కూజా’.. ఇలాంటి మాటలు రాయడంలో జంధ్యాల దిట్ట. ఇక మేనరిజమ్స్ అయితే అద్భుతం. ఒక క్యారెక్టర్ రకరకాల వంటలు చేసి చంపేస్తుంది. ఇంకో క్యారెక్టర్‌‌ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ నేర్చుకోడానికి నానా తంటాలూ పడుతుంది. ఒక పాత్ర బాధ కలిగినా, సంతోషం కలిగినా విజిల్ వేసేస్తుంటుంది. ఇంకొక పాత్ర సినిమాలు చూసొచ్చి టైటిల్ దగ్గర్నుంచి శుభం కార్డు వరకు కథ చెప్పి చంపేస్తుంది. ఇలా మాటలతోనైతేనేమి, చేష్టలతోనైతేనేమి.. కడుపుబ్బ నవ్వించడమే ధ్యేయంగా రచన చేసేవారు జంధ్యాల. కామెడీ ఎలా చేయాలో నేర్పించిన పాఠశాల ఆయన. 

ఆయన చలవే!

తెలుగు ప్రేక్షకులు కొన్ని దశాబ్దాల పాటు కడుపారా నవ్వుకున్నారంటే అది జంధ్యాల చలవే. కామెడీ కాన్సెప్టుల్ని క్రియేట్ చేయడమే కాదు.. వాటిని పండించేలా ఆర్టిస్టుల్ని తీర్చదిద్దడంలో కూడా జంధ్యాల ఎక్స్పర్ట్. సుత్తి కొట్టడంలో నిష్ణాతులైన వీరభద్రరావు, వేలు తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది జంధ్యాల వల్లనే. ఇక కామెడీకి వికీపీడియా లాంటి బ్రహ్మానందాన్ని పట్టుకొచ్చింది కూడా జంధ్యాలే. శ్రీలక్ష్మి లాంటి లేడీ కమెడియన్‌ని తీర్చిదిద్దింది ఆయనే. చిరంజీవి లాంటి యాక్షన్ హీరోని సైతం జేమ్స్‌‘పాండ్‌’గా మార్చేసి కడుపుబ్బ నవ్వించింది ఆయనే. రాజేంద్ర ప్రసాద్‌ కామెడీ హీరోగా నిలదొక్కుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించిందీ ఆయనే. హీరో అయినా హీరోయిన్ అయినా.. విలన్ అయినా, క్యారెక్టర్ ఆర్టిస్టయినా.. ఎవరైనా ఆయన స్కూల్‌లో చేరితే కమెడియన్‌గా మారిపోవాల్సిందే. కామెడీ టైమింగ్ నేర్చుకోవాల్సిందే.   


మరపురాని స్వరం


జంధ్యాల రాసే మాటలే కాదు.. జంధ్యాల మాటలు కూడా చక్కగా వినాలనిపించేవి. ఒక చక్కని స్వరంతో.. సున్నితంగా, మంద్రంగా మాట్లాడుతుంటే చెవులు అప్పగించి వినాలనిపించేది. అందుకే చాలామంది ఏరి కోరి ఆయనతో డబ్బింగ్ చెప్పించిన సందర్భాలున్నాయి. ‘భారతీయుడు’ తెలుగు వెర్షన్‌లో నెడుమూడి వేణు పాత్రకి వాయిస్ ఇచ్చారు జంధ్యాల. ‘అరుణాచలం’లో విసుకి ఆయనే మాట్లాడారు. ‘భామనే సత్యభామనే’లో జెమినీ గణేషన్‌కి, ‘ఇద్దరు’లో ప్రకాష్‌ రాజ్‌కి కూడా గళాన్ని అరువిచ్చారు. ‘పడమటి సంధ్యారాగం’లో విజయశాంతికి బాబాయిగా నటించిన ఆర్టిస్ట్కి డబ్బింగ్ చెప్పింది జంధ్యాలే. ‘చూపులు కలిసిన శుభవేళ’లో సుత్తి వీరభద్రరావుకి డబ్బింగ్ చెప్పడానికి మాత్రం పెద్ద కారణమే ఉంది. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యి, డబ్బింగ్ స్టార్ట్ అయ్యేలోపు వీరభద్రరావు చనిపోయారు. దాంతో ఆయన క్యారెక్టర్‌‌కి తనే వాయిస్ ఇచ్చారు జంధ్యాల. అలా చెప్పేటప్పుడు వీరభద్రరావుని తలచుకుని చాలా ఎమోషనల్ అయ్యేవారట. ఆయనకి జంధ్యాల వాయిస్‌ అతికినట్టు సరిపోవడంతో పనిగట్టుకుని గమనిస్తే తప్ప వీరభద్రరావుకి ఎవరో మాట్లాడారనే విషయాన్ని గమనించలేరు ప్రేక్షకులు.  

    మొత్తంగా జంధ్యాల సినిమా అంటే గంపెడు నవ్వులు. ఆ నవ్వులకి ఎప్పటికీ కాలం చెల్లదు. కానీ ఆయనకి మాత్రం ఆయువు తీరిపోయింది. 2001లో.. సరిగ్గా ఇదే రోజున.. గుండెపోటుతో జంధ్యాల చనిపోయారు. ప్రాణంగా ప్రేమించే భార్యని, లోకంగా భావించే ఇద్దరు కూతుళ్లనే కాదు.. ఆయన ఇచ్చిన నవ్వుల బూస్టర్‌‌తో ఆరోగ్యాలు పెంచుకున్న వందల, వేల, లక్షల, కోట్ల అభిమానుల్ని సైతం వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆరోజే ఈ ప్రపంచానికి మొదటిసారి తెలిసింది.. జంధ్యాలకి నవ్వించడమే కాదు, కన్నీళ్లు పెట్టించడమూ తెలుసని!