పలాస, శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం లాంటి రూటెడ్ సబ్జెక్టులతో ప్రేక్షకులకు దగ్గరైన కరుణ కుమార్.. వరుణ్ తేజ్‌తో ‘మట్కా’ చిత్రాన్ని తెరకెక్కించాడు. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ చెప్పిన విశేషాలు.
ఇదొక మనిషి లైఫ్ జర్నీ. వాసు అనే వ్యక్తి బర్మా నుంచి వైజాగ్‌కి శరణార్థిగా వస్తాడు. మార్కెట్ కూలీగా మొదలైన తన కెరీర్.. ‘మట్కా’కింగ్‌గా ఎలా ఎదిగాడనేది కమర్షియల్ ఫార్మాట్‌లో తీశాం. వైజాగ్‌లో ఒకప్పుడు జరిగిన ఈ గేమ్ గురించి చాలా రీసెర్చ్ చేశా. సెల్ ఫోన్ లేని రోజుల్లో దేశం మొత్తానికి ఒక నెంబర్‌ని పంపించడం అనేది ఈ కథలో ఇంటరెస్టింగ్ పాయింట్. ఒకవేళ నేనే రతన్ ఖత్రీ అయివుంటే ఏం చేసేవాడిని అని తనలా ఆలోచించి ఆ ఐడియాస్‌తోనే ఈ స్క్రిప్ట్ చేశా.
అలాగని రతన్ ఖత్రి జీవితాన్ని తీసుకోలేదు. వాసు పాత్రలో వరుణ్ తేజ్ చాలా బాగా నటించారు. ఇందులో ఆయన బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూస్తారు. వరుణ్ లుక్స్ కోసం చిరంజీవి గారి రిఫరెన్సులు తీసుకున్నాం. 20 ఏళ్ల తర్వాత కూడా ‘మట్కా’ సినిమా గురించి, ఇందులోని వరుణ్ నటన గురించి మాట్లాడుకుంటారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్ చంద్ర క్యారెక్టర్స్ కథలో చాలా కీలకంగా ఉంటాయి. కన్నడ కిషోర్, జాన్ విజయ్ గ్రే క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. అజయ్ ఘోష్‌ది వెరీ సర్‌ప్రైజింగ్ క్యారెక్టర్. ఇక జీవీ ప్రకాష్ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. మంచి ప్రొడక్ట్ కోసం ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’’.