దర్శకుడిగా యాభైకి పైగా సినిమాలు చేసిన ముత్యాల సుబ్బయ్య.. తన కొడుకు అనంత కిషోర్‌ను నిర్మాతగా పరిచయం చేస్తూ తన సమర్పణలో రూపొందించిన చిత్రం ‘తల్లి మనసు’. ఆయన వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడు. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య లీడ్ రోల్స్‌లో నటించారు.
ఈనెల జనవరి 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ ‘‘యాభై సినిమాల ప్రయాణంలో ఎలాగోలా ఒక సినిమా చుట్టేయాలని ఎప్పుడూ అనుకోలేదు. సమాజానికి పనికి వచ్చే పాయింట్‌తో కామెడీ, సెంటిమెంట్, డ్రామా మేళవించి సినిమాలు చేశా. సెంటిమెంట్ సినిమాల వల్ల నాకు సెంటిమెంట్ సుబ్బయ్య అని కూడా పేరొచ్చింది. ఇప్పుడు కూడా మంచి కథ లభించే వరకూ వేచి చూసి మా అబ్బాయి నిర్మాతగా ఈ సినిమా రూపొందించాం. సుదీర్ఘ అనుభవమున్న వి.శ్రీనివాస్ (సిప్పీ) ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం.
తల్లి లేకుండా ప్రపంచమే లేదు. అలాంటి తల్లి భావోద్వేగం, తపనను ఈ చిత్రంలో చక్కగా ఆవిష్కరించడం జరిగింది. తల్లి పాత్రలో కన్నడ నటి రచిత మహాలక్ష్మీ ఒదిగిపోయింది. మూడు పాటలు ఉంటాయి, కోటి సంగీతం, సుధాకరరెడ్డి కెమెరా వర్క్ ప్లస్ పాయింట్స్. ప్రేక్షకుడి మనసుకు హత్తుకునేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు.