ప్రజా యుద్ధ నౌక గద్దరన్న పేరిట..ఇకపై నంది అవార్డుల స్థానంలో ‘గద్దర్’అవార్డులు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ (ఫిబ్రవరి 13న)హైదరాబాద్ సోమాజిగూడలో గద్దర్ అవార్డ్ సినీ ఇండస్ట్రీ అవుట్ లుక్ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డెరెక్టర్ ఎన్ శంకర్ మాట్లాడుతూ..నంది అవార్డ్ను గద్దర్ అవార్డ్గా ప్రకటించడం ఆహ్వానిస్తున్నాని అన్నారు. సినీమా వాళ్ళలో కొంతమందిలో ఉండే భిన్నాభిప్రాయాలు గురించి చాలా మంది చాలా విధాలుగా మాట్లాడారు. అసలు గద్దర్ కు సినిమాకు సంబంధం ఏంటని ? గద్దర్ అవార్డ్ ఇస్తే ఇండ్లలో పెట్టుకుంటారా? అనే అభిప్రాయం ఉన్నవాళ్ళకు చెప్పేది ఒకటే..
'తెలంగాణ అస్థిత్వాన్ని..భూ వ్యవస్థ మీద చేసిన పోరాటాన్ని చూపిన మా భూమి సినిమా నుంచి మొదలు పెడితే..అనేక సినిమాలు గద్దర్ గాత్రంతో పాటలు వచ్చాయి. ఎంతోమందిని కదిలించేలా చేశాయి. ఆయన గజ్జ కట్టి ఆడి పాడి లక్షలాది మందిని నవ్వించడం..ఉత్తేజ పరచడం అది కేవలం గద్దర్ కే సాధ్యం అయిందని..అది ఏ కళాకారిణి కూడా సాధ్యం కాదని తెలిపారు. అలాగే గద్దర్ అవార్డ్ గర్వంగా తలెత్తుకొని తీసుకొనే అవార్డ్ అని.. గద్దర్ అవార్డ్ను ఇంట్లో పెట్టుకుంటే స్పూర్తి పొందొచ్చని అన్నారు.అంతేకాకుండా..గద్దర్ కళాకారుడే కాదు, మానవత్వం మూర్తి' అని డైరెక్టర్ ఎన్ శంకర్ తన మనసులో మాటను వివరించారు.
ఈ కార్యక్రమంలో పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ..గద్దర్ పేరు మీద నంది అవార్డ్ ఇవ్వడం హర్షణీయం.ఈ ఒక్క విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ రెవల్యూషన్ రెడ్డి అనొచ్చు. రేవంత్ రెడ్డి నా మాటే శాసనం అనడం చాలా గొప్పవిషయం..గద్దర్ వెన్నుపూస లోంచి వచ్చిన మాట అని అన్నారు. దేశ సాహిత్యానికి జ్ఞానపీఠ్ అవార్డు ఉన్నది కానీ అంతర్జాతీయ స్థాయిలో జానపద పీఠ్ అవార్డ్ ఎందుకు లేదు..అది కూడా పెట్టాలని సూచించారు.అలాగే, గద్దర్ ఏకవచనం కాదు, బహువచనం, బహుళ వచనం, బహుజన వచనం, భారత వచనం అని సుద్దాల మాట్లాడారు.
గద్దర్ కుమారుడు సూర్యం మాట్లాడుతూ..పాఠ్యాంశాలలో కూడా గద్దర్ జీవిత చరిత్ర రావాలంటే..ఫౌండేషన్ ద్వార ముందుకు వెళ్ళండి అని సూచించారు.అందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని సూర్యం తెలిపారు.ఎందుకంటే గద్దర్ భారత దేశ వారసత్వ సంపదని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రొ.కంచ ఐలయ్యా, సినీ దర్శకుడు ఎన్.శంకర్, సుద్దాల అశోక్ తేజ, పాశం యాదగిరి, రియాజ్, కొల్లూరు సత్తయ్య,వారితో పాటు కవులు, కళాకారులు, మేధావులు, సినీ రంగ ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.
గద్దరన్నను గౌరవించుకోవడం అంటే తెలంగాణ సంస్కృతిని, ప్రగతిశీల భావజాలంతో సమాజాన్ని చైతన్య పరిచే ప్రజా కవులను, ప్రజాగాయకులను గౌరవించుకోవడమే. ఇక నుంచి గద్దర్ అవార్డులు తెలంగాణ కళాకారుల కీర్తిపతాకను ప్రపంచానికి చాటి చెప్తాయయని ప్రభుత్వం కూడా వివరించింది.గద్దరన్న అవార్డ్ను సినీ, టీవీ కళాకారులకు ప్రభుత్వం ఇవ్వనుంది.