నలుగురి మహిళల పోస్టుమార్టం రిపోర్టులు దర్యాప్తులో చాలా కీలకం 

నలుగురి మహిళల పోస్టుమార్టం రిపోర్టులు దర్యాప్తులో చాలా కీలకం 

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రి ఘటనపై హెల్త్ డైరెక్టర్ వివరణ 

హైదరాబాద్ : ఇబ్రహీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలైన ఘటనపై తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వివరణ ఇచ్చారు. 34 మంది మహిళలకు అనుభవం ఉన్న నిపుణులైన డాక్టర్లతోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించామని చెప్పారు. దురదృష్టవశాత్తు నలుగురు మహిళలు చనిపోవడం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేయిస్తోందని చెప్పారు. నలుగురు మహిళలు చనిపోవడానికి అసలు కారణాలేంటో తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు వేగంగా కొనసాగుతోందన్నారు.

వారం రోజుల్లో దర్యాప్తు నివేదికను రాష్ర్ట ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. ముఖ్యంగా చనిపోయిన వారి పోస్టుమార్టం రిపోర్టులు కూడా దర్యాప్తులో చాలా కీలకమన్నారు. ప్రస్తుతం 30 మంది మహిళల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వెల్లడించారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ రెగ్యూలర్ గా జరిగే ప్రక్రియని, దేశవ్యాప్తంగా ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతుంటాయని చెప్పారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్ రాష్ర్ట ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. అంతేకాకుండా చనిపోయిన మహిళల పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. గత 75 సవత్సరాల నుంచి మన దేశంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరుగుతున్నాయని, కేంద్రం గైడ్ లైన్స్ తో గుర్తించిన ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారని చెప్పారు. 2016 నుంచి ఎలాంటి టార్గెట్ లు లేవని, మహిళలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారని వివరించారు. 

ఈనెల 25న అసలేం జరిగింది..? 
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలైన ఘటనపై మూడ్రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఈ నెల 25వ తేదీన 34 మంది మహిళలకు ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. అయితే.. వీరిలో నలుగురు మహిళలకు ఆపరేషన్లు ఫెయిలై చనిపోయారు. మిగిలిన 30 మంది మహిళల్లో ఏడుగురికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వెంటనే వారిని అపోలో హాస్పిటల్ కు తరలించి.. ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. మిగతా వారిని ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి.. మళ్లీ టెస్టులు చేస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు.. వారిని డాక్టర్లు అబ్జర్వేషన్ లో ఉంచారు. 

ఎప్పుడు ఏం జరిగింది..? 

* ఆపరేషన్లు ఫెయిలైన ఘటనపై మూడ్రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
* ఈ నెల 25న 34 మంది మహిళలకు ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్లు 
* 34 మందికి డబుల్ పంచ్‌‌‌‌డ్‌‌‌‌ ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు 
* నలుగురు మహిళలకు వికటించిన ఆపరేషన్లు 
* ఆదివారం ముగ్గురు మృతి, మంగళవారం మరో మహిళ మృతి
* ఆపరేషన్ ఫెయిలై అస్వస్థతకు గురైన మమత, సుస్మిత, లావణ్య, మౌనిక
* ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లిన తర్వాత వాంతులు, విరేచనాలు
* ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  ఆదివారం మృతి చెందిన సుస్మిత, సౌమ్య
* 30 మంది మహిళల్లో ఏడుగురికి అనారోగ్య సమస్యలు 
* అపోలో హాస్పిటల్ లో ఏడుగురికి ట్రీట్ మెంట్ అందిస్తున్న డాక్టర్లు
* ఆపరేషన్ వికటించిన ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మృతి
* ఆపోలో ఆస్పత్రిలో మరో ఏడుగురికి చికిత్స, ఒకరి పరిస్థితి విషమం
* ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5లక్షలు, డబుల్ బెడ్రూం ఇండ్లు
* ఘటనపై విచారణకు ఆదేశించిన తెలంగాణ సర్కార్
* వారం రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామన్న హెల్త్ డైరెక్టర్ 
* డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయారంటున్న బాధిత బంధువులు
* వైద్యులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ 
* బాధిత కుటుంబాలకు రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్లు

ఒకేసారి పదుల సంఖ్యలో ఆపరేషన్లు
డబుల్ పంచ్​డ్ ల్యాప్రోస్కోపిక్ అనేది కొన్ని నిమిషాల వ్యవధిలోనే పూర్తయ్యే సర్జరీ. కానీ ఈ సర్జరీలు చేసే డాక్టర్లు ప్రభుత్వ వైద్య రంగంలో సుమారు 20 మంది మాత్రమే ఉన్నారు. వీళ్లే రాష్ట్రమంతటా తిరిగి క్యాంపులు పెట్టి ఒకేరోజు పదుల సంఖ్యలో సర్జరీలు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో యాదాద్రి భువనగిరి జిల్లా హాస్పిటల్లో ఆపరేషన్ల కోసమని 20 మంది మహిళలకు మత్తు మందు ఇచ్చి, ఆపరేషన్లు చేయకుండానే డాక్టర్లు వెళ్లిపోయారు. ఈ నెల 27న (శనివారం) సూర్యాపేటలోని మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్లో ఒకేరోజు వంద మందికి ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ తర్వాత అబ్జర్వేషన్ కోసం హాస్పిటల్లో ఉంచేందుకు బెడ్లు చాలక, హాస్పిటల్ బయట నేల మీద పడుకోబెట్టారు. ఇలా గంపగుత్తగా ఆపరేషన్లు చేసి, ఆపరేషన్ తర్వాత జాగ్రత్తగా చూసుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల మహిళలు ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.