
- నెల రోజుల్లో ఖాళీలను భర్తీ చేసి మెరుగైన వైద్యం అందిస్తాం
- డీఎంఈ శివరాంప్రసాద్
నల్గొండ అర్బన్, వెలుగు : సర్కార్ హాస్పిటల్స్‌లో మెరుగైన వసతులు కల్పిస్తామని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శివరాంప్రసాద్ చెప్పారు. ఖాళీగా ఉన్న డాక్టర్, ఇతర పోస్టులను నెల రోజుల్లో భర్తీ చేస్తామన్నారు. నల్గొండలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్‌ను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఐసీయూ, క్యాజువాలిటీ, ఎంసీహెచ్‌తో పాటు పలు వార్డులను పరిశీలించారు.
రోగులు, వారి సహాయకులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెడికల్ కాలేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్‌లో డాక్టర్లు, ఇతర సిబ్బందితో పాటు శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లోని పోస్టులను సైతం త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. హాస్పిటల్స్‌లో డాక్టర్ల కొరత ఉంది వాస్తవమేనని, ఆ పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలోనే ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. రెండు, మూడు రోజుల్లో 80 మంది సీనియర్ ఫ్యాకల్టీని కౌన్సెలింగ్‌కు పిలిచి హాస్పిటల్స్‌కు కేటాయిస్తామని చెప్పారు.
హాస్పిటల్స్‌కు వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని, అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు తయారుచేసి ప్రజావైద్యాన్ని బలోపేతం చేస్తామన్నారు. నల్గొండ హాస్పిటల్స్‌లో 550 బెడ్స్ ఉండగా, సిబ్బంది, డాక్టర్లు లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతోందన్నారు. ఆయన వెంట హాస్పిటల్ సూపరింటెండెంట్ అరుణకమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ నగేశ్, ఐసీయూ ఇన్‌చార్జి రమేశ్ పాల్గొన్నారు.