ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శక, నిర్మాత రాజేంద్ర ప్రసాద్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న 'ఆ నలుగురు' సహా తెలుగు చిత్రాలు తీసిన దర్శకుడు చంద్ర సిద్ధార్థకు ఈయన సోదరుడు. తెలుగు సినిమా 'నిరంతరం' (1995)కు రాజేంద్రప్రసాద్ దర్శకుడు, నిర్మాత, రచయితగా చేశారు.
'నిరంతరం' సినిమా మలేషియాలోని కైరో చలన చిత్రోత్సవాలకు ఎంపిక అయ్యింది. పలువురి ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్‌లో 'మన్ విమన్ అండ్ ది మౌస్', 'రెస్డ్యూ - వేర్ ది ట్రూత్ లైస్', 'ఆల్ లైట్స్, నో స్టార్స్' చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటికీ ఆయనే సినిమాటోగ్రఫీ, రైటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
తెలుగులో 'మేఘం', 'హీరో' సహా పలు చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా సేవలు అందించారు. ఈయన హిందీ సినిమాలు కూడా చేశారు. రాజేంద్రప్రసాద్ ముంబైలో స్థిరపడ్డారు. ఆయన మృతి పట్ల చిత్రసీమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.