12 ఏళ్లలోనే తండ్రి కెమెరాతో మూవీ.. దర్శకుడు శ్యామ్ బెనెగల్ నేపథ్యం ఇదే

12 ఏళ్లలోనే తండ్రి కెమెరాతో మూవీ.. దర్శకుడు శ్యామ్ బెనెగల్ నేపథ్యం ఇదే
  • దక్కన్​ సినీ మొఘల్​శ్యామ్​బెనెగల్​కన్నుమూత
  • ముంబైలో తుదిశ్వాస విడిచిన శ్యామ్​ బెనెగల్​
  • హైదరాబాద్​ సంస్థానంలోని తిరుమలగిరిలో జననం
  • ఓయూ నుంచి ఎంఏ ఎకనామిక్స్​లో పట్టా
  • గురుదత్, సత్యజిత్‌‌ రే స్ఫూర్తితో 1974లో ‘అంకుర్’ సినిమాకు డైరెక్షన్​
  • సోషల్​ ఇష్యూస్​పైనే ఎక్కువ సినిమాలు 
  • 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్
  • 2005లో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

హైదరాబాద్​, వెలుగు: ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్‌‌ (90) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ముంబైలోని ఓ దవాఖానలో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.  ఆయన కూతురు ఈ విషయాన్ని  ధ్రువీకరించారు. పది రోజుల క్రితం శ్యామ్​ బెనెగల్​కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య తన 90వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఆయన చిత్రాల్లో నటించిన  నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, కుల్ భూషణ్​ ఖర్బంద, దివ్యా దత్తా, రజత్ కపూర్, అతుల్ తివారిలాంటి వాళ్లంతా పాల్గొన్నారు. రెండు, మూడు కొత్త ప్రాజెక్ట్‌‌లు చేస్తున్నట్టు శ్యామ్ బెనెగల్ ఈ సందర్భంగా చెప్పారు. కానీ ఇంతలోనే ఆయన కన్నుమూశారు. శ్యామ్ బెనెగల్‌‌కు భార్య నీరా బెనెగల్,  కుతురు ప్రియా బెనెగల్ ఉన్నారు.  

బాల్యం, విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‎లోనే..

అప్పటి హైద‌‌రాబాద్ సంస్థానంలోని తిరుమ‌‌ల‌‌గిరిలో 1934 డిసెంబర్ 14న  కొంకణి మాట్లాడే చిత్రాపూర్ సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో శ్యామ్ బెనెగ‌‌ల్ పుట్టారు. సికింద్రాబాద్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్‌‌లో పట్టా పొందారు.  కర్నాటకకు చెందిన ఆయన తండ్రి శ్రీధర్​ బెనెగల్ ఓ ఫొటోగ్రాఫర్. తన తండ్రి ఇచ్చిన కెమెరాతో పన్నెండేళ్ల వయస్సులోనే శ్యామ్ బెనెగల్​ తన తొలిచిత్రాన్ని రూపొందించారు. స్టూడెంట్‌‌గా ఉన్నప్పుడు హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని ఏర్పాటుచేశారు.

 1959లో ముంబైలోని ఓ యాడ్ ఏజెన్సీలో కాపీరైటర్‌‌‌‌గా కెరీర్‌‌‌‌ ప్రారంభించారు.  ఆ తర్వాత మరో సంస్థలో క్రియేటివ్ హెడ్‌‌గా వందలకొద్దీ యాడ్‌‌ ఫిలిమ్స్‌‌కు వర్క్ చేశారు. 1962లో గుజరాతీలో ఫస్ట్ డాక్యుమెంటరీ తీశారు.  ఆ తర్వాత గురుదత్, సత్యజిత్‌‌ రే స్ఫూర్తితో సినిమా మేకింగ్‌‌పై దృష్టి సారించి 1974లో ‘అంకుర్’ సినిమా తీశారు.  తను కాలేజ్‌‌ మ్యాగజైన్‌‌లో రాసిన చిన్న కథ ఆధారంగా అనంత్  నాగ్, షబానా ఆజ్మీ లీడ్ రోల్స్‌‌లో దీన్ని తెరకెక్కించారు.  దీనికి సెకండ్ బెస్ట్ ఫీచర్‌‌‌‌ ఫిల్మ్‌‌గా నేషనల్ అవార్డు లభించింది. 

ఆ తర్వాత తీసిన నిషాంత్ (1975), మంథన్ (1976) సినిమాలు ఆయనకు ఎక్కువ పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. సర్దారీ బేగం (1996),  ది మేకింగ్ ఆఫ్ మహాత్మా (1996),  భూమిక (1977), జునూన్ (1979), సమర్ (1999), మండి (1983),  హరి భరీ (2000),  జుబేదా (2001),  నేతాజీ సుభాష్​​చంద్రబోస్ – ది ఫర్ గాటెన్ హీరో (2005) సినిమాలు ఆయనకు ఎంతో పేరుతోపాటు పలు అవార్డులను తెచ్చిపెట్టాయి. 

సినిమాలతోపాటు ఎన్నో డాక్యుమెంటరీస్‎ను తెరకెక్కించారు. నెహ్రూ, సత్యజిత్‌‌ రే జీవితాలపై డాక్యుమెంటరీలు తీశారు. అలాగే, పలు షార్ట్ ఫిల్మ్స్, సీరియల్స్‌‌ను ఆయన డైరెక్ట్ చేశారు. 1978లో హిందీలో ‘కొండుర’,  తెలుగులో  ‘అనుగ్రహం’ అనే టైటిల్‌‌తో  బైలింగ్వల్ సినిమా తీశారు. అనంత్ నాగ్, వాణిశ్రీ జంటగా నటించగా హిందీలో శేఖర్ ఛటర్జీ  పాత్రను తెలుగులో రావు గోపాలరావు పోషించారు.  

బెనెగల్‎ది భిన్నశైలి

రెగ్యులర్ మెయిన్‌‌ స్ట్రీమ్ సినిమా నిబంధనలకు భిన్నంగా తనదైన శైలిలో శ్యామ్​ బెనెగల్​ సినిమాలు తీసి, విజయాలు అందుకున్నారు. సామాజిక సమస్యలు, సాంస్కృతిక మార్పులు, ఆర్థిక అసమానతలు ఇతివృత్తంగా ఆయన సినిమాలు రూపొందించారు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో ఇండిపెండెంట్‌‌ ఫిమేల్ క్యారెక్టర్స్ ఉండేవి. స్మితా పాటిల్, నసీరుద్దీన్ షా, ఓంపురి,  అమ్రిష్ పురి లాంటి ఎంతోమంది ఆయన సినిమాలతో పాపులర్ అయ్యారు.

దాదాపు ప్రతి చిత్రానికి అవార్డు

శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో తెరకెక్కిన దాదాపు ప్రతి  చిత్రానికీ అవార్డులు దక్కాయి. బెస్ట్ డైరెక్టర్‌‌‌‌గా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను ఆయన కైవసం చేసుకున్నారు.  ‘అంకుర్’ (1975) చిత్రంతో మొదలు వరుసగా ఐదేండ్లు నేషనల్ అవార్డు అందుకున్నారు. నిశాంత్ (1976), మంథన్ (1977), భూమిక (1978), జునూన్ (1979) చిత్రాలకు ఈ​ అవార్డ్స్​దక్కాయి. 

రెండేండ్ల గ్యాప్‌‌ తర్వాత ఆరోహన్ (1982) చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును మరోసారి సొంతం చేసుకున్నారు. సినీరంగంలో ఆయన సేవలకుగానూ 1976లో పద్మ శ్రీ, 1991లో పద్మ భూషణ్, 2003లో ఇందిరా గాంధీ జాతీయ సమైక్యత పురస్కారంతో పాటు 2005లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. అలాగే,  2013లో ఏఎన్ఆర్  అవార్డు, 2015లో లైఫ్ టైమ్ అచీవ్‌‌మెంట్ అవార్డు, 2011లో బీఎన్ రెడ్డి నేషనల్ అవార్డు అందుకున్నారు.