పుష్ప 2 ఎలా ఉండబోతుందో ఆ ఒక్క సీన్‌‌కే నాకు అర్థమైంది: డైరెక్టర్ రాజమౌళి

పుష్ప 2 ఎలా ఉండబోతుందో ఆ ఒక్క సీన్‌‌కే నాకు అర్థమైంది: డైరెక్టర్ రాజమౌళి

ఏ సినిమా ఫంక్షన్‌‌కు వెళ్లినా ఆ సినిమా ప్రమోషన్‌‌కు హెల్ప్ అయ్యేలా మాట్లాడుతాం. కానీ ‘పుష్ప 2’ సినిమాకు ఆ అవసరం లేదు.  ప్రపంచంలో ఉన్న ఇండియన్స్‌‌ అంతా ఇప్పటికే టికెట్లు కొనేసి ఉంటారు’’ అని అన్నారు రాజమౌళి.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి హైదరాబాద్‌‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ ‘పుష్ప 1 ప్రీ రిలీజ్‌‌కు ఇదే స్టేజ్‌‌పై బన్నీతో నార్త్ ఇండియాలోనూ ప్రమోట్ చేయమని చెప్పా.  ఇప్పుడు ‘పుష్ప 2’కి ఆ అవసరం లేదని చెబుతున్నా. మూడు నెలల క్రితం ఈ మూవీ షూటింగ్ స్పాట్‌‌కి వెళ్లా.

 పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్‌‌ను చూపించారు. ఆ సీన్‌‌ చూశాక.. దేవిశ్రీ ఎంత మ్యూజిక్ ఇవ్వగలిగితే అంత రేంజ్‌‌కు వెళ్తుంది అని చెప్పా.  సినిమా మొత్తం ఎలా ఉండబోతోందో ఆ ఒక్క సీన్‌‌కే నాకు అర్థమైంది’ అని అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘నటీనటులు ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇచ్చారు. రష్మిక డెడికేషన్‌‌ చూసి ఆశ్చర్యపోయా. శ్రీలీల డ్యాన్స్‌‌తో మెస్మరైజ్ చేస్తుంది. సుకుమార్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన లేకపోతే నేను లేను. మైత్రి  పొడ్యూసర్స్ తప్ప ఇలాంటి సినిమాను మరెవరూ నిర్మించలేరు. 

క్యూబా విజువల్స్, దేవిశ్రీ మ్యూజిక్  అవుట్‌‌స్టాండింగ్‌‌. 80 దేశాల్లో 6 భాషల్లో 12500 థియేటర్స్‌‌లో సినిమా రిలీజ్ అవడం బిగ్ సెలబ్రేషన్స్‌‌గా భావిస్తున్నాం’అని చెప్పాడు. సుకుమార్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఇలా వచ్చింది అంటే దానికి కారణం బన్నీపై ఉన్న ప్రేమే.  ఒక చిన్న ఎక్స్‌‌ప్రేషన్ కోసం ఎంతో ఫైట్ చేస్తాడు. ఇలాంటి ఓ స్టార్ పడే తపన డైరెక్టర్‌‌‌‌కి ఎంతో ఎనర్జీని ఇస్తుంది’ అని చెప్పారు. ఇందులో పెర్ఫార్మెన్స్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశానని రష్మిక చెప్పగా,  స్పెషల్ సాంగ్ చాన్స్ ఇచ్చినందుకు శ్రీలీల థ్యాంక్స్ చెప్పింది. 

నిర్మాత అల్లు అరవింద్,  దర్శకులు గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని విష్ చేశారు. మైత్రి నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్, సీఈవో చెర్రీ,  అనసూయ, దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ మిరోస్లో కుబా బ్రోజెక్,  ప్రొడక్షన్ డిజైనర్స్ రామకృష్ణ, మౌనిక,  కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి తదితరులు పాల్గొన్నారు.