సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ క్రమంలో ఇవాళ డిసెంబర్ 19న పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్‌ను పరామర్శించారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. డిసెంబర్ 9న శ్రీతేజ్ తండ్రికి డైరెక్టర్ సుకుమార్ భార్య రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందించారు.
ఇకపోతే నిన్న (డిసెంబర్ 18న) అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ వెళ్లి కలిశారు. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ప్రస్తుతం శ్రీతేజ్ బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడికి వెంటిలెటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ట్యూబ్ సహాయంతో ఆహారం అందిస్తున్నారు.
అయితే అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా డిసెంబర్ 4 రాత్రి.. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్య థియేటర్ కి వచ్చాడు. దీంతో అక్కడ ఫ్యాన్స్ పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా బాలుడు శ్రీ తేజ్ తీవ్ర అస్వస్థతకి గురయ్యాడు. శ్రీతేజ్ 15 రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్‌లో మృత్యువుతో పోరాడుతున్నాడు.