రజినీకాంత్ హీరోగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో టీజే జ్ఞానవేల్ రూపొందించిన చిత్రం ‘వేట్టయాన్’. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా దసరాకి విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు టీజే జ్ఞానవేల్ మాట్లాడుతూ ‘రజినీకాంత్ అభిమానులను అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో సినిమాను రూపొందించడమే నా మెయిన్ టార్గెట్. ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ.. ఆయన అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టాను.
ఈ కథకి రజినీ స్టైల్, మేనరిజం జోడించా. ఆయన నాపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నారు. నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నా. రజినీకాంత్, అమితాబ్ పాత్రలను బ్యాలెన్స్ చేయడం సవాల్‌గా తీసుకున్నా. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్‌కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివి.. వాటి ద్వారానే కథ రాశా. ఈ ఎన్‌కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? దోషుల్నే శిక్షిస్తున్నామా? అనే వాటిని చూపించాను.
అలాగే విద్యా వ్యవస్థలోని లోపాలను కూడా చూపించా. ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్ సహా పాత్రలన్నింటికీ మంచి పేరు వచ్చింది. అనిరుధ్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు ప్రీక్వెల్ చేయడానికి ఆసక్తిగా ఉన్నా. కథలోని చాలా అంశాలకు బ్యాక్ స్టోరీని చెప్పాలనుకుంటున్నా’ అని అన్నారు.