ఫ్యామిలీ ఫొటో కోసం బ్యాచిలర్స్ కష్టాలు : త్రినాధరావు నక్కిన

ఫ్యామిలీ ఫొటో కోసం బ్యాచిలర్స్ కష్టాలు : త్రినాధరావు నక్కిన

సందీప్ కిషన్ హీరోగా త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘మజాకా’. అనిల్ సుంకర, రాజేష్ దండా నిర్మించారు. రావు రమేష్, రీతు వర్మ, అన్షు కీలక పాత్రలు పోషించారు.  బుధవారం సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు త్రినాధరావు మాట్లాడుతూ ‘‘ధమాకా’ టైమ్‌‌లోనే ప్రసన్న కుమార్ ఈ స్టోరీ చెప్పాడు. అయితే రావు రమేష్‌‌ను దృష్టిలో ఉంచుకుని చెప్పాడు. కొందరు హీరోల దగ్గరకు వెళ్లింది కూడా.  ఫైనల్‌‌గా ఈ కథను సందీప్ కిషన్ ఒప్పుకోవడం చాలా గ్రేట్. మలయాళ చిత్రం ‘బ్రో డాడీ’కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. 

ఆడ దిక్కులేక బ్యాచిలర్స్‌‌గా బతుకుతున్న తండ్రీకొడుకు.. ఎప్పటికైనా తమ  ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫొటో పెట్టుకోవాలని తపన పడుతుంటారు. దీని కోసం వాళ్లు పడే బాధలు, ప్రయత్నాలు ఫన్‌‌ వేలో చూపించాం.  చివరి ఇరవై నిముషాలు ఎమోషనల్‌‌గా ఉంటాయి.  ఇక ఓ దర్శకుడిగా నా ప్రయాణం ఎంతో సజావుగా సాగుతోంది.  నిర్మాత నుంచి ప్రేక్షకుల వరకూ ఎవరూ నష్టపోని సినిమాలు చేస్తున్నందుకు హ్యాపీ. నిర్మాతగా నేను తీస్తున్న ‘చౌర్యపాఠం’ ఏప్రిల్‌‌లో విడుదల కానుంది. అలాగే ‘అనకాపల్లి’ అనే మరో చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నా. రవితేజ గారి ‘ధమాకా’కు సీక్వెల్‌‌గా ‘డబుల్ ధమాకా’ చేస్తే బాగుంటుంది. అదే ప్రయత్నం చేస్తున్నాను” అని చెప్పాడు.