మాటల రచయితలు అంటే..మాటలు పుట్టించాలా?..లేక ఆ మాటలను గుర్తుంచుకునేలా రాయాలా?..అంటే ఈ రెండు ఉంటేనే మాటల మాంత్రికుడు అనగలం. అటువంటి మాటలతో..తనదైన యాసా ప్రాసలతో అక్షరానికి ప్రాణం పుట్టించగలిగే రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas).నేటితో (ఏప్రిల్ 22) త్రివిక్రమ్ సినీ ఎంట్రీకి 25 ఏళ్లు పూర్తవుతోంది(25YearsofTrvikram).
త్రివిక్రమ్ 1999లో కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన స్వయంవరం చిత్రానికి రచయితగా మొదటి అవకాశం వచ్చింది. ఆ తర్వాత నువ్వే కావాలి, చిరునవ్వుతో, నిన్నే ప్రేమిస్తా, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలకు మాటలు రాసి స్టార్ రైటర్ గా పేరు పొందాడు. తర్వాత తరుణ్ కథానాయకుడిగా వచ్చిన నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఇక తర్వాత కూడా తన కలానికి పదును పెడుతూ రచయితగా వాసు, మన్మథుడు, ఒక రాజు ఒక రాణి, మల్లీశ్వరి, జై చిరంజీవ చిత్రాలకు పనిచేశాడు.
నువ్వే నువ్వే సినిమా తర్వాత మహేష్ బాబు కథానాయకుడిగా వచ్చిన అతడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ డైరెక్టర్ గా మారాడు. ఇక ఆ తరువాత నుంచి మొన్నటి గుంటూరు కారం సినిమా వారికి తనదైన శైలిలో కథలు రాసుకుంటూ..సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇన్నాళ్లు త్రివిక్రమ్ పెన్ను పవర్ టాలీవుడ్కి మాత్రమే తెలుసు..తన స్టామినా ఏంటనేది. ఇక నెక్స్ట్ రాబోయే అల్లు అర్జున్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో పెన్ను పవర్ చూపించడానికి రెడీ అయ్యాడు.
ఇదిలా ఉంటే..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన డైలాగ్స్తో.. సినిమాలను హిట్ ట్రాక్ లోకి తీసుకురాగలిగే దిట్ట. హీరోలకే కాకుండా డైరెక్టర్స్కి కూడా ఫ్యాన్స్ ఉంటారనే తెలిపిన జ్ఞాని. ఎప్పుడు తన మూవీస్లో స్టోరీకి ప్రాధాన్యం ఇస్తూనే..డైలాగ్స్ గొప్పతనం గురుంచి కూడా చెప్పగలిగే అపార మేధావి. అందరూ త్రివిక్రమ్ శ్రీనివాస్ను గౌరవంతో గురూజీ అని పిలుచుకుంటూ ఉంటారు. కానీ నిజంగా ఆయన ఏ ఒక్కరికో గురువు కాదు..ఆయన మాటలు విని పాటించే ప్రతి ఒక్కరికి గురువే.
కొత్తగా మాటలు ఎవరు పుట్టించగలరు. ఎవరో మాట్లాడితేనే కదా..మనం మాట్లాడుకునేది..ఆ తర్వాత వాటిని అందంగా అల్లుకునేది అంటాడు త్రివిక్రమ్. ఎక్కడో భీమవరంలో జన్మించిన శ్రీనివాస్..న్యూక్లియర్ ఫిజిక్స్లో ఎం.ఎస్.సి చేసి..గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. చదువుపై మక్కువ ఎక్కువున్న కానీ, ఫ్యాషన్తో సినిమాలకు రావడం అంటే సాహసం అని చెప్పుకోవాలి.
ఉపాధ్యాయుడిగా పనిచేసిన కూడా సాహిత్యంపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి..మంచి గుర్తింపు పొందారు. వేణు హీరోగా వచ్చిన స్వయం వరం మూవీతో మాటల రచయితగా ఎంట్రీ ఇచ్చి..ఇప్పటికీ తనదైన డైలాగ్ బలంతో అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు.
The impact he created over the past 25 years with his films, words and characters is unimaginable. One of the greatest writers and directors of Telugu Cinema, #25YearsofTrvikram! ❤️
— Haarika & Hassine Creations (@haarikahassine) April 22, 2024
Thank you for existing and being the reason for our existence, our Darling Director #Trivikram… pic.twitter.com/WuXKqqa9Ma
త్రివిక్రమ్ మాటల సత్యాలు:
అందరికంటే మనిషి గొప్పోడు. అతని కలలు గానీ..అతని ఆశయాలు గానీ..అతని అలవాట్లు గానీ..జీవితంలో అతడిని ఎంత ముందుకు తీసుకెళ్తాయి.లేదంటే ఎంత వెనక్కి విసిరేస్తాయి.అతని ఆశయం గొప్పది అయితే పైకి ఎక్కుతాడు అతను అలవాట్లు, ఆశలు చెడ్డవి అయితే కిందకి పడిపోతాడు.
మనిషి అసలు మాట్లాడుకోవడం మానేశాడు. ఎక్కడికో చూస్తూ మాట్లాడుతున్నాం. పక్కన ఉన్నవాళ్లను మరిచిపోతున్నాం. మొబైల్ చూస్తూ పక్క వారికి హాయ్ చెప్తున్నాం. ఇంట్లో అమ్మ వాళ్ళతో మాట్లాడకుండా..సీరియల్ పెట్టుకుని భోంచేస్తున్నాం. లేదంటే నైట్ 10 ,11 దాకా ఇంగ్లీష్ సినిమా చూసి పడుకుంటాం. ప్రపంచం బాగుండాలంటే మనిషి ఒకరి కళ్ళల్లో..ఒకరు చూసుకుని మాట్లాడుకుంటే చాలు.
కలలు కనండి. చాలా పెద్ద పెద్ద కలలు కనండి. వాటిని సాధించుకోవడానికి ప్రయత్నించండి. మన కలలు ఎప్పుడూ కూడా మనం ఊహించిన దాని కంటే ఎక్కువ పెద్దగా ఉండాలి.
బాధలో ఉన్న వాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం...బాగున్న వాడిని ఎలా ఉన్నావని అడగటం అనవసరం.
సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు...చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు.
జీవితం ఎలాంటిది అంటే.. ఇంట్రస్ట్ ఉన్నవాడికి ఆప్షన్ ఉండదు.. ఆప్షన్ ఉన్నవాడికి ఇంట్రస్ట్ ఉండదు.
యుద్దంలో గెలవటం అంటే శత్రువుని చంపడం కాదు..ఓడించడం.
మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి..కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు సార్
తండ్రికి, భవిష్యత్తుకి భయపడని వాడు జీవితంలో పైకి రాలేడు.
యుద్ధం చేసే సత్తా లేని వాడికి.. శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు
పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించలేరా?
కూతురిని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవటం కాదు..మోసపోయి కన్నవాళ్ల దగ్గరకి వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
- ఇప్పటివరకు త్రివిక్రమ్ డైరెక్టర్ గా తీసిన 13 సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ తానే అందించడం విశేషం.