‘లక్కీ భాస్కర్’ విజయం చాలా సంతృప్తిని ఇచ్చిందని దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి విడుదలై అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఈ సందర్భంగా వెంకీ అట్లూరి మాట్లాడుతూ ‘ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు, రివ్యూ రైటర్లతో సహా చూసిన వారందరూ బాగుందని చెప్పడం నిజంగా గొప్ప విషయం. అదృష్టంగా భావిస్తున్నా. ప్రతి సీన్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన థియేటర్లో చూసి చాలా సంతోషం కలిగింది. ఈ చిత్రం విజయం సాధిస్తుందని దుల్కర్ సల్మాన్ బలంగా నమ్మారు. ఆయన నమ్మకమే నిజమైంది.
ఫస్ట్ హాఫ్ కథ వినగానే షూటింగ్ ఎప్పుడు, ఎన్ని రోజులు డేట్స్ కావాలన్నారు. సెట్లోనూ అదే ఎనర్జీ. నిర్మాత నాగవంశీ కూడా అంతే నమ్మారు. తక్కువ బడ్జెట్లో తీయాలని నేను ఆలోచిస్తే.. ఆయన మాత్రం కథకు తగ్గ భారీతనం తీసుకొచ్చారు. బ్యాంకింగ్ నేపథ్యం కావడంతో చాలా రీసెర్చ్ చేసి ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యేలా సీన్స్ రాసుకున్నా. ఇక నెక్స్ట్ ప్రాజెక్టు గురించి ఏమీ ఆలోచించలేదు. కొన్ని కథలైతే రాసుకున్నా’ అని చెప్పాడు.