ఫస్ట్ మూవీ ‘నాంది’తో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న విజయ్ కనకమేడల.. అల్లరి నరేష్‌తోనే రెండో సినిమాగా ‘ఉగ్రం’ తీశాడు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘ప్రతిరోజూ మనం మిస్సింగ్ వార్తలు చూస్తున్నాం. మిస్ అవుతున్న వారు ఏమౌతున్నారో నివేదిక ఇవ్వమని తెలంగాణ హైకోర్టు కూడా పోలీసు వాళ్లని కోరినట్టు ఓ ఆర్టికల్ చదివాను. ‘నాంది’ తీస్తున్నప్పుడే దీనిపై ఓ సినిమా చేయాలనుకున్నా. ఆ మూవీ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత లాక్‌డౌన్ రావడంతో నేను, తూము వెంకట్ కలిసి ఈ స్టోరీ రెడీ చేశాం. నరేష్ గతంలో ఎమోషనల్ రోల్స్ చేసినప్పటికీ పూర్తి యాక్షన్ రోల్ చేయలేదు. ఆయనకైతే కొత్తగా ఉంటుంది అనిపించింది. కథ చెబితే ఆయనకూ నచ్చింది.
ఇదొక మంచి యాక్షన్ థ్రిల్లర్. ఇందులో ‘నాంది’ కంటే ఎక్కువ ఎమోషన్స్, మాస్ , ఇంటెన్స్ ఉంటాయి. కథలో చాలా కొత్త ఎలిమెంట్స్ వుంటాయి. కథ చెప్పినప్పుడే గెటప్, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో నరేష్ కి క్లారిటీ వచ్చింది. స్టిఫ్ గా ఉండటానికి కొన్ని వర్క్ అవుట్స్ చేయడం, కాన్ఫిడెంట్‌గా మాట్లాడటం లాంటివి షూటింగ్‌కి ముందే చర్చించాం. యాక్షన్ సీన్స్ విషయంలో చాలా కేర్ తీసుకుని, ముందే రిహార్సల్స్ చేశాం. ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఎమోషన్ వుంటుంది. దాన్ని ప్రేక్షకులు కూడా ఫీలవుతారు. ట్రైలర్‌తో అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలని అందుకుంటాం. థియేటర్ లో చాలా సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ వుంటాయి. ఇప్పటికే ఆల్ రౌండర్ అని ప్రూవ్ చేసుకున్న నరేష్ ‘ఉగ్రం’తో యాక్షన్‌తోనూ మెప్పిస్తారనే నమ్మకముంది. నాగచైతన్య కోసం ఓ కథ అనుకుంటున్నా. చాలా మంచి సోషల్ డ్రామా’ అని చెప్పాడు.