చిల్లేపల్లి పీఏసీఎస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ అవినీతి చేసిండు : డైరెక్టర్లు

సూర్యాపేట, వెలుగు: చిల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్, సీఈవో అవినీతికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్లు కోరారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ వెంకట్‌‌‌‌రావుకు మెమోరాండం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 2020 –21లో చైర్మన్‌‌‌‌, సీఈవో మిల్లు యజమాన్యంతో కుమ్మక్కై వేరే ప్రాంతాల రైతుల పేర్లపై 1,25,772 బస్తాల ధాన్యం కొన్నట్లు బిల్లులు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

దీనిపై చైర్మన్ నిలదీస్తే తమకేం సబంధమని బుకాయించారని మండిపడ్డారు.వీటితో పాటు మార్క్ ఫెడ్‌‌‌‌కు చెల్లించాల్సినరూ. 5 లక్షలను సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. రైతులు అమ్మిన ధాన్యం డబ్బులు చైర్మన్..వారి బంధువు అకౌంట్లలో జమ చేశారన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చైర్మన్‌‌‌‌, సీఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మేళ్లచెరువు పీఏసీఎస్‌‌‌‌ సెక్రటరీపైనా..

మేళ్లచెరువు, వెలుగు: మేళ్లచెరువు పీఏసీఎస్‌‌‌‌ సెక్రటరీ గుమ్మిత వెంకటరెడ్డి బ్యాంకులో 13 ఏళ్లుగా తిష్ట వేసి అనేక అక్రమాలకు పాల్పడ్డారని సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌ వెంకట్‌‌‌‌రావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎరువుల కొనుగోళ్లలో ప్రైవేటు వ్యాపారులతో కుమ్మక్కయారని, సంఘం తరుపున కొన్న భూ లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

వడ్ల కొనుగోళ్లలో రైతులకు రవాణా చార్జీలు చెల్లించకుండా గోల్ మాల్ చేశారని, దీర్ఘకాలిక రుణాల్లో లంచాలు తీసుకున్నారని,గొర్రెలు, బర్రెల ఫారాలు లేకుండానే లోన్లు మంజూరు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గోడౌన్ల నిర్మాణ నిధుల పక్కదారి పట్టించడంతో పాటు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎర్రగట్టు తండాకు చెందిన యువకులను మోసం చేశారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో వెంకయ్య, రాములు, సాయికుమార్, జయరాజు, వీరారెడ్డి, బాలకృష్ణ తదితరులు ఉన్నారు.