చైర్మన్​ ఒంటెద్దు పోకడలతోనే అవిశ్వాసం

  • క్యాంపులో ఉన్న 14 మంది డైరెక్టర్లు 

నల్గొండ, వెలుగు : డీసీసీబీ చైర్మన్​ గొంగిడి మహేందర్​రెడ్డి ఒంటెద్దు పోకడలతోనే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వచ్చిందని డైరెక్టర్లు అన్నారు. 15 మంది డైరెక్టర్లు చైర్మన్​కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. బుధవారం ఏకంగా డైరెక్టర్లు చైర్మన్​కు సవాల్​విసిరారు. తాము ప్రలోభాలకు తలొగ్గి అవిశ్వాస తీర్మానం పెట్టామని చైర్మన్​ కామెంట్స్​చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. నాలుగేళ్ల పాలనలో ఎలాంటి ప్రలోభాలు ఇచ్చి తమను లొంగదీసుకున్నాడో చెప్పాలని డిమాండ్​ చేశారు.

ఉద్యోగుల బదిలీలు, మీటింగ్​లో నిర్ణయాలన్నీ ఏకపక్షంగానే సాగిపోయాయని విమర్శించారు. చైర్మన్ భార్య సునీత రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, వారంటే తమకు ఎనలేని గౌరవం ఉందని, వ్యక్తిగత విమర్శలకు దిగితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చైర్మన్​పైనే భూకబ్జా కేసులు అనేకం ఉన్నాయని, అయినప్పటికీ వ్యక్తిగత విమర్శలకు వెళ్లద్దొన్న ఉద్దేశంతోనే సైలెంట్​గా ఉన్నామని చెప్పారు. ఆయన స్థాయిని తగ్గించుకోకుండా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తే సరేసరి లేదంటే అనవసరంగా అభాసు పాలుకావాల్సి వస్తుందన్నారు.

28న జరిగే అవిశ్వాసం మీటింగ్​లో ఆయన ఓడిపోవడం ఖాయమని, ఈలోగా ఆయనే పదవి నుంచి తప్పుకుంటే మంచిందని సూచించారు. సమావేశంలో డైరెక్టర్లు కుంభం శ్రీనివాస్ రెడ్డి, పాశం సంపత్​రెడ్డి, కోడి సుష్మా, జూలూరి శ్రీని వాస్, అందెం లింగం యాదవ్, గుడిపాటి సైదులు, కొండా సైదయ్య, వీరస్వామి, బంటు శ్రీను, కొమ్ము కరుణ, అనురాధ, జయరామ్​ నాయక్​, కొమ్ము సైదులు తదితరులు ఉన్నారు.