- రాజీనామా చేసేదే లేదంటున్నడీసీసీబీ చైర్మన్ మహేందర్‌రెడ్డి
- డైరెక్టర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని స్పష్టీకరణ
నల్గొండ, వెలుగు : డీసీసీబీ రాజకీయం రసకందాయంలో పడింది. చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తాను రాజీనామా చేసేదేలేదని, అవిశ్వాసాన్ని ఎదుర్కొంటానని మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నల్గొండలో డీసీసీబీ కార్యాలయంలో ఆయన అవిశ్వాస తీర్మానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చైర్మన్ సీటు ఆశిస్తున్న కుంభం శ్రీనివా స్రెడ్డితో సహా19 మంది డైరెక్టర్లు తనతో సన్నిహితంగా మెలిగారని, బ్యాంకు అభివృద్ధికి దోహదపడ్డారని, తిరిగి వాళ్లే తనపై అవిశ్వాస తీర్మానం పెట్టడం బాధాకరమని చెప్పారు.
14 మంది డైరెక్టర్లు తనవైపే ఉన్నారని కుంభం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం డీసీవోను కలిసి అవిశ్వాస తీర్మానం లేఖను అందజేసిన సంగతి తెలిసిందే. అయితే డైరెక్టర్లు ఎవరూ బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని, శ్రీనివాస్ రెడ్డి ఒక్కరే కాంగ్రెస్‌కు చెందినవారని, మిగిలిన వారంతా ఓటింగ్సమయానికి మనస్సు మార్చుకుంటారని మహేందర్ రెడ్డి భావిస్తున్నారు. మహేందర్‌రెడ్డితో కలిపి నలుగురు డైరెక్టర్లు ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు. శ్రీనివాస్‌రెడ్డికి మద్దతు తెలిపిన వారు 14 మంది కాగా, వీళ్లలో మరో ఇద్దరు, ముగ్గురు చివరి నిమిషంలో హ్యాండిస్తే అవిశ్వాసం వీగిపోయే ప్రమాదం ఉంది.
ఈనెల 28న అవిశ్వాసంపై ఓటింగ్జరగనుంది. అప్పటివరకు డైరెక్టర్లను కాపాడుకునేందుకు ఇరువర్గాలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పలువురు డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి క్యాంప్‌లో ఉన్నారు. అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్న డైరెక్టర్లు తమ ఆత్మప్రబోధానుసారం నడుచుకోవాలని, నాలుగేళ్లలో డీసీసీబీ రూ.2,500 కోట్ల టర్నోవర్‌కు తీసుకెళ్లాలని, ఉద్యోగుల పదోన్నతులు, నియామకాలు, బదిలీలు, రుణాల విషయంలో సమష్టిగా పనిచేయడంతో జాతీయ స్థాయిలో అవార్డులు సైతం వచ్చాయని మహేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు.
అవిశ్వాసమా...హైడ్రామానా..!
మహేందర్ రెడ్డిపై అవిశ్వాసం పేరుతో కాంగ్రెస్‌లోని ఓ వర్గం హైడ్రామాకు తెరలేపినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏడెనిమిది జిల్లాలకు చెందిన డీసీసీబీ చైర్మన్లు కాంగ్రెస్‌లో చేరారు. వరంగల్ జిల్లాకు చెందిన చైర్మన్‌ను టెస్కాబ్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. మహేందర్‌రెడ్డి వైస్చైర్మన్పదవికి రాజీనామా చేయడానికి ముందే టెస్కాబ్ చైర్మన్పదవి ఆఫర్‌చేశారు. కానీ మాజీ సీఎం కేసీఆర్మీదున్న నమ్మకంతో ఆయన తిరస్కరించారు. జిల్లాలో మహేందర్‌రెడ్డి పార్టీ మారితే బాగుండని కాంగ్రెస్‌లోని ఓ వర్గం బలంగా కోరుకుంటోంది.
మహేందర్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఆ వర్గం లీడర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు కూడా తెలిసింది. ఏడు నెలల్లో డీసీసీబీ పాలకవర్గం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డిని కాంగ్రెస్‌లో లాగితే, జిల్లాలో బీఆర్ఎస్ నామరూపాల్లేకుండా పోతుందని ఆ వర్గం నేతలు అభిప్రాయపడుతున్నారు. అవిశ్వాస తీర్మానం మీటింగ్ జరిగే నాటికి డీసీసీబీ రాజకీయం ఎటువైపు మలుపు తిరుగుతుందోనని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.