రామగుండంలో జెన్​కో ప్లాంట్​ను సందర్శించిన డైరెక్టర్లు

రామగుండంలో జెన్​కో ప్లాంట్​ను సందర్శించిన డైరెక్టర్లు
  • 800 మెగావాట్ల ప్లాంట్​ ఏర్పాటుపై పరిశీలన

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండంలో మూసివేసిన 62.5 మెగావాట్ల జెన్​కో పవర్​ప్లాంట్​ స్థానంలో 800 మెగావాట్ల సూపర్​క్రిటికల్​ పవర్​ప్లాంట్​ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు శుక్రవారం జెన్​కో ఉన్నతాధికారులు ప్లాంట్​ను సందర్శించారు. ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశంలో కొత్త ప్లాంట్​ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో టీజీఎస్ ​జెన్​కో సివిల్ ​డైరెక్టర్​హెచ్ఆర్​అజిత్, ప్రాజెక్ట్స్​ డైరెక్టర్​సచ్చితానంద రామగుండంలో పర్యటించారు. ఒక మెగావాట్​ప్లాంట్​ నిర్మాణానికి 0.82 ఎకరాల భూమి అవసరం కాగా, 800 మెగావాట్ల సూపర్ ​క్రిటికల్​ పవర్​ప్లాంట్​ఏర్పాటుకు 650 ఎకరాల భూమి సరిపోతుంది. అయితే, రామగుండంలో 700.24 ఎకరాల భూమి అందుబాటులో ఉండడంతో..ఇక్కడ 800 మెగావాట్ల పవర్​ప్లాంట్​ఏర్పాటుకు మార్గం సుగమమైనట్టుగా తెలుస్తున్నది. 

అవసరమైన బొగ్గు సింగరేణి నుంచి, నీళ్లను ఎల్లంపల్లి ప్రాజెక్ట్​ నుంచి తీసుకునే వీలుంది. ఇందుకోసం ప్రతిపాదనలు తయారు చేసేందుకు ఆఫీసర్లు సిద్ధమై జెన్​కో ప్లాంట్​ను సందర్శించి పరిశీలించినట్టు తెలుస్తున్నది. కాగా, రామగుండంలో మూసివేసిన జెన్​కో ప్లాంట్​ స్థానంలో కొత్తగా 800 మెగావాట్ల పవర్​ప్లాంట్​ను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇటీవల సింగరేణి ప్రకటించింది. అయితే ఈ ప్లాంట్​ను సింగరేణి నిర్మిస్తుందా? లేక టీజీఎస్ ​జెన్​కో నిర్మిస్తుందా? అనేది తెలియట్లేదు.